Mon Apr 06 2026 15:59:56 GMT+0530 (India Standard Time)
YSRCP : రాయలసీమలో వైసీపీ నేతల వార్.. పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందా?
వైసీపీ అధికారంలో లేదు. అందరూ కలసి కట్టుగా పార్టీని బలోపేతం చేయాల్సిన సమయం

వైసీపీ అధికారంలో లేదు. అందరూ కలసి కట్టుగా పార్టీని బలోపేతం చేయాల్సిన సమయం. అయితే రాయలసీమ నేతలు మాత్రం ఒకరినొకరు తిట్టుకుంటూ పార్టీ పరువును నడి బజారున పడేస్తున్నారు. పార్టీ హైకమాండ్ కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో మరింత సీమ వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాయలసీమ వైసీపీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో గ్రూపు రాజకీయాలు, టికెట్ల పంచాయితీలు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం సీమ నేతల చిందులను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
కర్నూలు జిల్లాలోనూ...
ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి, బుట్టా రేణుక వర్గాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇరు వర్గాలు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాయి. ఎమ్మిగనూరులో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుటుంబానికి, మాజీ ఎంపీ బుట్టా రేణుక వర్గానికి మధ్య తీవ్ర ఘర్షణ నడుస్తోంది. కేడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. సింగనమలలో వర్గపోరు, కదిరిలో నేతల ఘర్షణలు తరచుగా రోడ్డెక్కుతున్నాయి. సింగనమల నియోజకవర్గంలో వైసీపీ నేతల అంతర్గత పోరుబహిరంగంగా బయటపడుతోంది. కదిరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు చెప్పులతో కొట్టుకునే స్థాయికి విభేదాలు తీవ్రమయ్యాయి.
అనంతపురం జిల్లాలోనూ...
ఇక అనంతపురం జిల్లాలోని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాళ్లను వెంటేసుకుని తిరుగుతున్నారంటూ తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒకసారి పార్టీ మారిన వారిని పార్టీలోకి తీసుకుంటే చెప్పుతో కొడతానంటూ కేతిరెడ్డి మండిపడ్డారు. ఇలా నేతల మధ్య ర్గ విభేదాలు రాబోయే కాలంలో పార్టీ బలాన్ని తగ్గిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్య పోరు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర రాజకీయ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
Next Story

