Fri Dec 26 2025 09:08:02 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : బాలినేనికి ధీటైన్ అభ్యర్థి వైసీపీకి దొరికేశాడట
వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించాలని సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రినివాసులు రెడ్డి పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు మాగుంట రాఘవరెడ్డిని లైన్ లో పెట్టారని సమాచారం. ఒంగోలు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి గత కొన్ని ఎన్నికల నుంచి ఆయనే అభ్యర్థిగా పోటీ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్, వైసీపీలో కూడా ఒంగోలు టిక్కెట్ బాలినేని శ్రీనివాసులు రెడ్డిదే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బంధుత్వమే ఇందుకు ప్రధాన కారణం. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారు.
మాగుంట కుటుంబానికి...
ఆ స్థానంలో మాగుంట రాఘవరెడ్డికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. మాగుట రాఘవరెడ్డి ఒంగోలు, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని తొలుత జగన్ భావించారు. అయితే కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో వైసీపీకి సరైన అభ్యర్థులున్నారు. కానీ ఒంగోలు నియోజకవర్గంలోనే ధీటైన అభ్యర్థి లేరు. అందుకు ఒంగోలు శాసనసభ నుంచి మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయిస్తే బాగుంటుందని జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికి టిక్కెట్ ఇచ్చి ఒంగోలు టిక్కెట్ మాత్రం మాగుంట రాఘవరెడ్డికి ఇవ్వడానికి జగన్ ఓకే చెప్పినట్లు ప్రకాశం రాజకీయాల్లో చర్చ జోరుగా నడుస్తుంది.
సేవా కార్యక్రమాలతో...
మాగుంట కుటుంబానికి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై మంచి పట్టుంది. మాగుంట సుబ్బరామిరెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నాటి నుంచి ఆ కుటుంబానికి ఒంగోలు పార్లమెంటు పరిధిలో తిరుగులేకుండా ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. మాగుంట సుబ్బరామిరెడ్డి పేరిట మహిళా కళాశాలలు, ఉచిత మంచినీటి సరఫరాతో పాటు పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుండటంతో ప్రజల్లో ఆ కుటుంబంపై అభిమానం, ఆప్యాయత చెక్కు చెదరలేదు. అందుకే ఈసారి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి ప్రత్యామ్నాయంగా ఈసారి మాగుంట రాఘవరెడ్డిని బరిలోకి దింపాలన్నది జగన్ ఆలోచన. మరి చివరకు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
Next Story

