Fri Dec 05 2025 13:16:11 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీలో ఆ మూడు కులాల వాయిస్ ఏదీ?
అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి బలమైన గొంతుకగా మారిన వైసీపీ నేతలు ఇప్పడు సైలెంట్ అయ్యారు.

వైసీపీ అధికారాన్ని కోల్పోయి అప్పుడే ఎనిమిది నెలలు దాటి పోయింది. 2024 ఎన్నికలలో ఓటమి తర్వాత రెండు సామాజికవర్గాల నేతల వాయిస్ పెద్దగా వినిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి బలమైన గొంతుకగా మారిన నేతలు ఇప్పడు సైలెంట్ అయ్యారు. వరస కేసులు వారిని భయపెడుతున్నట్లుంది. అలాగే తాము టీడీపీ టార్గెట్ నుంచి తప్పించుకోవడానికి మౌనంగానే ఉంటున్నారు. మరికొందరు ఇప్పటికే కండువాలు మార్చి తమ దారి తాము చూసుకున్నారు. ఇలా కేవలం కొన్ని సామాజికవర్గం నేతలు మాత్రమే పార్టీకి అండగా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించిన వైసీపీ అందులో కనీసం పది నియోజకవర్గాల నేతలు కూడా నోరు మెదపడం లేదు.
కామ్ గా కాపులు...
ప్రధానంగా కమ్మ, కాపు, బీసీ కులాల వాయిస్ పెద్దగా వైసీపీ నుంచి వినిపించడం లేదు. కాపు సామాజికవర్గం నుంచి కేవలం అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణలు మాత్రమే స్పందిస్తున్నారు. ఆయన ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టి టీడీపీపై విరుచుకుపడుతున్నారు. నిన్న మొన్నటి వరకూ టీడీపీ, జనసేనలను తీవ్రంగా విమర్శించిన పేర్ని నాని సయితం ఆయన కుటుంబ సభ్యులపై బియ్యం మాయమైన కేసు నమోదు అయిన తర్వాత కొంత తగ్గినట్లే కనిపిస్తుంది. ఇక సామినేని ఉదయభాను, కిలారు రోశయ్యలు జనసేనలోకి జంప్ చేశారు. ఆళ్ల నాని టీడీపీలోకి వెళ్లారు. అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. తోట త్రిమూర్తులు వంటి వారున్నా కాపు సామాజికవర్గం నుంచి పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ముద్రగడ పద్మనాభం వంటి వారు కూడా పెద్దగా స్పందించడం లేదు.
కమ్మ సామాజికవర్గం నేతలు సైలెంట్...
కమ్మ సామాజికవర్గం నేతలుగా ముద్రపడి ఫైర్ బ్రాండ్లగా పేరొందిన వల్లభనేని వంశీ, కొడాలి నాని సయితం ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వల్లభనేని వంశీ అరెస్ట్ తో ఇక కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లారంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం మీడియాలో కనిపిస్తూ టీడీపీ, జనసేన నేతలపై వ్యక్తిగత విమర్శలు చేసేవారు. కానీ 2024 ఓటమి పాలయిన తర్వాత కొడాలి నాని కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. గుడివాడ నియోజకవర్గానికి రావడం కూడా మానుకున్నారు.ఇక గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన బొల్లా బ్రహ్మనాయుడు, 2019 ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి గెలిచిన నంబూరు శంకరరావు కూడా స్పందించడం లేదు. గత వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ పదవి పొందిన మర్రి రాజశేఖర్ లాంటి వాళ్లు కూడా పెద్దగా రియాక్ట్ కావడం లేదు. దీంతో ప్రధానమైన రెండు సామాజికవర్గాల నుంచి వైసీపీ వాయిస్ వినిపించడం లేదన్న చర్చ జరుగుతుంది.
బీసీ గొంతుక...
జగన్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు పెద్దపీట వేశారు. ఎక్కువ మంది బీసీ నేతలకు పదవులు అప్పగించారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ, మంత్రి పదవుల్లోనూ వారికే అగ్రతాంబూలం ఇచ్చారు. తరచూ నా బీసీ అంటూ జగన్ నినదించారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన బీసీ నేతలు ఇప్పుడు సైలెంట్ గా మారారు. బీసీ వాయిస్ కూడా పెద్దగా ఫ్యాన్ పార్టీలో వినిపించడం లేదు. బీసీ నేతలు వైసీపీలో లెక్కకు మించి ఉన్నప్పటికీ వారు బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఏపీలో బీసీ ఓటు బ్యాంకు బలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోఆ వాయిస్ వినిపించకపోవడం వైసీపీకి తీరని లోటు అనిచెప్పాలి. జగన్ ఎంత మొత్తుకున్నా బీసీ నేతలు మాత్రం బయటకు రావడం లేదు. ఇప్పటికైనా జగన్ జనం బాట పడితే నేతలు కొంతలో కొంత యాక్టివ్ అయ్యే అవకాశముందని సీనియర్ నేతలు భావిస్తున్నారు.
Next Story

