Wed May 21 2025 02:06:50 GMT+0000 (Coordinated Universal Time)
Rk Roja : రోజా నోటికి అడ్డూ అదుపూ లేదా? కంట్రోల్ చేయవా జగన్
వైసీపీ నేత ఆర్కే రోజా అనవసరంగా చేస్తున్న కామెంట్స్ వైసీపీని ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయి

ఆర్కే రోజా అనవసరంగా చేస్తున్న కామెంట్స్ వైసీపీని ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయి. తాను ఏమనుకుంటుందో ఏమో కానీ, రోజా మాత్రం చిన్నారులను సయితం వదిలిపెట్టకుండా విమర్శలు చేస్తుండటంతో సామాన్య ప్రజలతో పాటు పార్టీ అభిమానులు కూడా హర్ట్ అవుతున్నారు. అంతే కాదు.. రోజా ఏ ఉద్దేశ్యంతో అన్నా అది సోషల్ మీడియాలో వైసీపీకి బూమ్ రాంగ్ గా మారుతుంది. ఎందుకో తెలియదు కానీ ఆర్కే రోజా సినిమాల్లో, జబర్దస్త్ షోలో మాట్లాడిన తీరులా రాజకీయాల్లో మాట్లాడి పార్టీని ఇబ్బందుల్లో పడేస్తున్నారని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వంపై హామీలు అమలు చేయలేదన్న అసంతృప్తి పెల్లుబుకుతున్న సమయంలో రోజా కామెంట్స్ తో ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుంది.
ఎవరికి అనుకూలం?
అసలు రోజా వైసీపీకి అనుకూలంగా ఉన్నారా? లేక కూటమి ప్రభుత్వానికి తిరిగి కోలుకునేలా ఆమె సహకరిస్తున్నారా? అన్న అనుమానాలు కూడా సొంత పార్టీ నేతల్లోనే బయలుదేరాయి. ఎవరైనా రాజకీయ విమర్శలు చేయవచ్చు. హామీలు అమలు చేయకపోవడంపై ప్రశ్నించవచ్చు. తప్పుడు కేసులపై నిలదీయవచ్చు. అంతే తప్ప కుటుంబ సభ్యులను రాజకీయ వివాదంలోకి లాగితే ప్రజలు సెంటిమెట్ ఫీలవుతారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు వైసీపీ 2024 ఓటమికి కారణాలయ్యాయని రోజాకు తెలియదా? అని నేతలే ప్రశ్నిస్తున్నారు. వైసీపీకి వచ్చే సెంటిమెంట్ ను కూడా, సానుభూతిని కూడా రోజా తన వ్యాఖ్యలతో పోగొడుతున్నారని అంటున్నారు.
చిన్న పిల్లాడిపై...
తాజాగా భూమన కరుణాకరెడ్డిని తిరుపతిలో గోశాల వివాదంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఆర్కే రోజా అక్కడ ప్రత్యక్షమయ్యారు. తన జిల్లా కావడంతో అక్కడకు వచ్చినా మరోసారి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ కుమారుడికి ఇటీవల సింగపూర్ లో జరిగిన ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం వల్లనే అలా జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలు రోజా నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నది అర్థమయింది. చిన్న పిల్లవాడు ప్రమాదం నుంచి బయటపడితే హర్షించాల్సింది పోయి ఆ ఘటనను కూడా రాజకీయ వివాదంలోకి లాగటమేంటన్న ప్రశ్నలు వినపడుతున్నాయి. ఇలాగే రోజా మాట్లాడితే పార్టీకి మొన్న వచ్చిన స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు.
రోజా కామెంట్స్ తో ...
రోజా కామెంట్స్ తో జనసేన క్యాడర్ రగలిపోతుంది. పవన్ కల్యాణ్ అభిమానులు కూడా రోజా పై ఫైర్ అవుతున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు మౌనంగా ఉన్నప్పటికీ అదే రోజా పెద్ద శిక్ష అని అంటున్నారు. మరోవైపు జనసైనికులు మాత్రం రోజాను సోషల్ మీడియాలో ఒక ఆటాడేసుకుంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రోజాకు కొత్తేమీ కాకపోయినా పవన్ కల్యాణ్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోరు కానీ చిన్న పిల్లవాడిని బయటకు లాక్కొచ్చి చేసిన వ్యాఖ్యలు మాత్రం రోజా నాలుక ఎటు అంటే అటు వైపు తిరుగుతుందన్న కామెంట్స్ జోరుగా వినపడుతున్నాయి. అధికారంలో కోల్పోయినా ఇంకా పార్టీకి డ్యామేజీ చేస్తున్న రోజా లాంటి నేతలను జగన్ కట్టడి చేయాల్సి ఉంది.
Next Story