Thu Mar 27 2025 03:48:29 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఎమ్మెల్సీలపై జగన్ కు నమ్మకం లేనట్లుందిగా?
వైసీపీ అధినేత జగన్ కు సొంత పార్టీ ఎమ్మెల్సీలపై నమ్మకం లేనట్లుంది

వైసీపీ అధినేత జగన్ కు సొంత పార్టీ ఎమ్మెల్సీలపై నమ్మకం లేనట్లుంది. అందుకే ఆయన తరచూ తాను ముప్ఫయి ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని చెబుతున్నారు. మీ భవిష్యత్ కు నాది భరోసా అంటూ నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. తన వెంట ఉండేవారే నా వాళ్లు అంటూ పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అంటే ఏ మాత్రం బయటకు వెళ్లినా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ముఖం కూడా చూడనని పరోక్షంగా ఎమ్మెల్యేలకు చెబుతున్నారంటే కొంత అభద్రతా భావం జగన్ లో కనిపిస్తున్నట్లుగానే ఉంది. వైఎస్ జగన్ ది చిన్న వయసే కావడంతో మరో ముప్ఫయి ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పడంలో తప్పు లేదు కానీ, తన వాళ్లు ఎవరో చెప్పారంటే ఆయన కొంత భయపడుతున్నట్లే కనిపిస్తుంది.
తన వెంట ఉన్నవారే నావాళ్లంటూ...
అందుకే అసెంబ్లీ సమావేశాలకు కూడా ఎమ్మెల్యేలను దూరంగా ఉంచే ప్రయత్నం జగన్ చేస్తున్నారంటున్నారు. జగన్ కాకుండా వైసీపీకి పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకూ పార్టీని వీడుతారన్న ప్రచారం ఎలాంటిది జరగలేదు. కూటమి పార్టీలకు కూడా ఎమ్మెల్యేల అవసరం లేదు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటే అది కూటమి ప్రభుత్వానికే ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఆ ఆలోచనలు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలు చేయడం లేదు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన వారిలో బలమైన నేతలపైనే కూటమి ప్రభుత్వం గురి పెట్టింది. అంతే తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేల జోలికి వచ్చే అవకాశం అయితే లేదు.
ఎమ్మెల్సీలు వెళ్లిపోతారనేనా?
కానీ ఇప్పటికే రాజ్యసభ సభ్యులు నలుగురు పార్టీని వీడి వెళ్లడంతో ఎమ్మెల్యేలు కూడా వెళతారేమోనన్న భయం పట్టుకుంది. అదే సమయంలో ఎమ్మెల్సీలు కూటమి పార్టీల వైపు చూసే అవకాశాలున్నాయి. ఎమ్మెల్సీలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారని జగన్ కు తెలుసు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి మాత్రమే ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతుంది. తన వెంట ఉంటే రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆయన చెప్పారంటే ఒకవేళ తాను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వారికి ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్పడానికి జగన్ చేసే ప్రయత్నంగానే చూడాలి. ఎమ్మెల్సీలు కొందరు ఇప్పటికే పార్టీని వీడినా వారికి తిరిగి కూటమి ప్రభుత్వం అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు.
జమిలి ఎన్నికలు వస్తాయంటూ...
పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి వారిని పార్టీలోనే చేర్చుకునేందుకు ఇష్టపడలేదన్న విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేస్తున్నట్లే కనిపిస్తుంది. దీంతో పాటు 2028 లో జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పడం కూడా ఎమ్మెల్సీని కంట్రోల్ చేయడమే ఆలోచనగా కనిపిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేల టిక్కెట్లు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తానని ఆయన పరోక్షంగా చెబుతున్నారు. దాదాపు యాభై నియోజకవర్గాలు పెరుగుతుండటంతో అందరికీ అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానని చెబుతున్న జగన్ ఎన్నికలు త్వరగానే వస్తాయని చెబుతూ ఎమ్మెల్సీలను పార్టీని వీడకుండా కొంత మేరకు కట్టడి చేస్తున్నారని అనుకోవచ్చు.
Next Story