Sat Dec 06 2025 10:33:31 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ వాటిని నమ్ముకుంటే నిండా మునిగిపోక తప్పదట
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తామని భావిస్తున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తామని భావిస్తున్నారు. ఆయనకు జిల్లాల పర్యటనలో వచ్చి స్పందన చూసి మరోసారి అధికారం తనదేనని భావిస్తున్నారు. ఈసారి సర్వేలను నమ్ముకున్నట్లు కనిపించడం లేదు. సర్వేలు, ఐప్యాక్ వంటి సంస్థల వంటి వాటిని నమ్ముకుని నట్టేట మునిగామని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే సొంతంగా తానే జగన్ నియోజకవర్గాల నేతలను ఎంపిక చేసే విషయంపై దృష్టిపెట్టారు. అయితే జగన్ పై కోటరీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికీ పార్టీలో విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ ఓటమి తర్వాత కూడా కోటరీ నుంచి బయట పడలేకపోతున్నారని కొందరు నేతలు బాహాటంగానే చెబుతున్నారు. కోటరీని వదిలి వాస్తవ విషయాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా నియోజకవర్గాలకు నాయకత్వాలను ఎంపిక చేయాలని కోరుతున్నారు.
క్యాడర్ అభిప్రాయం మాత్రం..
ముందుగా కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కూడా అనేక మంది నేతలు కోరుతున్నారు. నేతలు చాలా మంది ఓటమి తర్వాత ఏడాది నుంచి నియోజకవర్గాల్లో ఉండటం లేదు. కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదు. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన నాయకులపై కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ తమను పట్టించుకోని నేతలు, ఓటమి తర్వాత కూడా తమకు అందుబాటులో ఉండటం లేదని క్యాడర్ అనేక నియోజకవర్గాల్లో అసంతృప్తిగా ఉంది. అయితే కూటమి పార్టీలను వ్యతిరేకిస్తూ, జగన్ పై అభిమానంతోనే ఇంకా జెండా పట్టుకుని ఉన్నామని, స్థానిక నేతలను చూసి కాదని సోషల్ మీడియాలో వారు పోస్టులు పెడుతున్నారు.
కోటరీ సలహాలు వింటే?
వైఎస్ జగన్ కూడా నేతలను దగ్గరకు తీసుకుంటే కార్యకర్తలు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే స్థానిక నాయకత్వంపై క్యాడర్ కు నమ్మకం లేకపోగా బాగా అసంతృప్తి ఉంది. కోటరీ మాత్రం గత ఎన్నికల్లో పోటీ చేసిన వారినే ఇన్ ఛార్జులుగా నియమించాలని, వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలని వత్తిడి తెస్తే మళ్లీ మోసం వస్తుందన్న కామెంట్స్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం జగన్ చేయాల్సింది కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేయడం. వారిని సముదాయించడం. తిరిగి వారిని ఉత్తేజపర్చడం. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా ఒకింత యాక్టివ్ అయింది. అయితే క్యాడర్ మరింతగా పార్టీ కోసం పనిచేయాలంటే జగన్ నేతలతో కాదు.. క్యాడర్ తో మమేకం కావాలని అంటున్నారు. మరి జగన్ ఈ దిశగా ఆలోచన చేస్తారా? లేదా? అన్నది చూడాలి.
Next Story

