Wed Feb 04 2026 22:28:45 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ నిర్ణయం ప్రభావం ఏపీలో ఉండనుందా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పెద్ద సమస్యే వచ్చి పడింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన తీసుకునే నిర్ణయం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పెద్ద సమస్యే వచ్చి పడింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన తీసుకునే నిర్ణయం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశారు. ఆయనకు పార్టీలతో సంబంధం లేదు. పైగా జస్టిస్ గా ఆయన నిర్వహించిన బాధ్యతలు, ఇచ్చిన తీర్పులు అందరి మన్ననలను అందుకున్నాయి. ముఖ్యంగా బలహీన వర్గాల ప్రతినిధిగా ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు ప్రశంసలు కురిపించాయి. అలాంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పుడు భారత ఉప రాష్ట్రపతిగా బరిలో దిగుతున్నారు. ఆయనకు ఇండి కూటమిలోని ఏ పార్టీతో సంబంధం లేదు. అలాగంటే ఆయనకు రాజకీయాలతోనే సంబంధం లేదు. కానీ జగన్ పార్టీ మాత్రం ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది.
ట్రాక్ రికార్డు చూసైనా...
అలాంటి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపర్చేందుకు జగన్ ముందుకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తెలుగు వ్యక్తిగానే కాకుండా సుదర్శన్ రెడ్డికి ఉన్న ట్రాక్ రికార్డు ను చూసి జగన్ బలపర్చాలన్న సంఖ్య పెరుగుతుంది. టీడీపీ, జనసేన ఎటూ ఎన్డీఏ కూటమిలో ఉండటంతో ఆ పార్టీలకు ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ జగన్ పరిస్థితి అలా కాదు. ఏ కూటమిలోనూ జగన్ లేకపోయినా ఆత్మప్రభోదానుసారం తీసుకోవాల్సిన నిర్ణయం కావడంతో జగన్ కు ఇది పెద్ద సమస్య అని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తి అయితే జగన్ కు ఎటువంటి రాజకీయ ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే జగన్ ఖచ్చితంగా కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారు కాబట్టి బీజేపీకి ఓటేసినా ఇబ్బంది ఉండదు. కానీ జగన్ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ప్రకటించారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో...
కానీ సుదర్శన రెడ్డి ఎంపికను ప్రత్యేకంగానే చూడాలి. ఆయనను న్యాయకోవిదుడిగానే చూడాలి. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో జగన్ వెంట నడిచే బలమైన సామాజికవర్గం కూడా సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మద్దతివ్వాలని కోరుకుంటుంది. అందుకే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ తీసుకునే నిర్ణయం రాజకీయంగా ఇబ్బందులు తెచ్చి పెట్టే అవకాశాలు లేకపోలేదని తెలుస్తుంది. ఎన్డీఏకు సంబంధించిన ఉప రాష్ట్రపతి అభ్యర్థితో జగన్ కు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. కేవలం బీజేపీ కేంద్ర నాయకత్వంతోనే ఆయనకున్న బంధం. కానీ సుదర్శన్ రెడ్డి విషయంలో అలా కాదు. వ్యక్తిగతంగా ఆయనకు మద్దతు ఇచ్చి తీరాలని కోరుకునే వారి సంఖ్య వైసీపీలోనే ఎక్కువగా వినిపిస్తుంది. మరి జగన్ తీసుకున్న నిర్ణయంతో ఒక సామాజికవర్గం నుంచి అసంతృప్తి తలెత్తే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Next Story
