Sat Sep 14 2024 23:59:29 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : ఏమయ్యా జగనూ.. స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? ఇంతమందికి సాయం మోదీ వల్ల కూడా కాదు
వైసీపీ అధినేత జగన్ వరద సాయంపై చేస్తున్న విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన కామెంట్స్ ను తప్పుపడుతున్నారు
అద్దాల మేడలో ఉన్నవారి పై రాళ్లు వేయడం ఎవరికైనా సులభం. కానీ వెంటనే నష్టం జరిగేది ఆ భవన యజమానికే. రాయి వేసిన ఆకతాయికి ఆనందం మాత్రం మిగులుతుంది. ఇప్పుడు అధికార పార్టీపై కూడా విమర్శలు చేయడం సులువే. కానీ వాటి సాధ్యాసాధ్యాలను గురించి ముందుగా స్టడీ చేసి ఆలోచిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. వైసీపీ అధినేత జగన్ ముందు అది నేర్చుకోవాల్సి ఉంటుంది. రాజకీయంగా విమర్శలు చేయడం సహజమే. కానీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధితులకు నష్టపరిహారం ఇచ్చానని, ఇప్పుడు చంద్రబాబు ఎందుకివ్వరని ఆయన ప్రశ్నించారు. పరిహారాన్ని తాను పునరావాస కేంద్రం నుంచి వెళ్లేటప్పుడే ముట్టచెప్పానని, ఇప్పుడు తక్కువ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు.
నాడు బాధితులు...
నాడు జగన్ హయాంలో వరదలు కోనసీమ ప్రాంతంలో సంభవించాయి. కొన్ని గ్రామాలకే పరిమితమయ్యాయి. ఆ గ్రామాల్లో సంఖ్య ఎంత అంటే ముప్ఫయి నుంచి నలభై వేల మంది. నష్టపోయింది కూడా అంతే. వారికి తలా రెండు వేల రూపాయలు పునరావాస కేంద్రం నుంచి వెళ్లేటప్పుడు ఇచ్చి పంపారు. అలాగే సరుకులు కూడా ఇచ్చి పంపారు. కానీ తక్కువ మంది కావడంతో అది సాధ్యమయింది. కానీ నేడు విజయవాడ బాధితులు ఎంతమంది? మూడున్నర లక్షల మందికి పైగానే వారందరికీ పునరావాస కేంద్రాలను ఏర్పాటు ఒక్క రాత్రిలో చేయడం సాధ్యమవుతుందా? అసలు వారికి పరిహారం ప్రకటించాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో గుండె సరిపోతుందా?
మూడున్నర లక్షల మందికి...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జగన్ కు తెలియంది కాదు. పది లక్షల కోట్లు అప్పులు చేసి మరీ వెళ్లాడు. ఈ సమయంలో మూడున్నర లక్షల మందికి రెండువేల రూపాయలను ప్రకటించినా ఎంత నిధులు ఖర్చవుతాయో తెలుసా? ఇప్పటికిప్పుడు సాధ్యమా? ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన జగన్ కు ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా అన్న ప్రశ్నలు వేయాల్సి ఉంటుంది. ముందు బాధితులు ప్రాణం పోకుండా కాపాడటం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగానే చంద్రబాబు సర్కార్ నిర్వహించింది. రేయింబవళ్లూ అధికారులు, చంద్రబాబు, మంత్రులు పనిచేసి ఎలాగోలా డెత్ టోల్ ను చాలా వరకూ తగ్గించగలిగారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి కొందరిని తరలించారు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్....
చంద్రబాబుకు ఉన్న అనుభవంతో లక్షల కొద్దీ ఆహారపు ప్యాకెట్లు, మంచినీటి బాటిల్స్ ను వెంటనే సరఫరా చేయగలిగారు. కానీ ప్రకృతితో ఆటలాడుకోవడానికి ఎవరూ సాహసించరు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు చేయూత నిచ్చే విధంగా, ఊరటకలిగే విధంగా, ధైర్యంగా ఉండాలని భరోసా ఇవ్వాలి కానీ ఇలా చౌకబారు విమర్శలు జగన్ చేయకుండా ఉంటే మంచిది. అధికారులను మార్చినంత మాత్రాన సహాయక చర్యలు ఆగుతాయా? ఇదెక్కిడి లాజిక్ జగనూ? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వరద పరిస్థితులపై కొంత అవగాహన ఉన్న వారు ఇలాంటి మాటలను స్వాగతించరు. హర్షించరు కూడా.
Next Story