Fri Dec 05 2025 09:14:25 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీ పుంజుకుంటుందా? ఫ్యాన్ వేవ్ అక్కడ మొదలయిందటగా
ఆంధప్రదేశ్ లో వైసీపీ మళ్లీ పుంజుకుంటున్నట్లు కనిపిస్తుంది

ఆంధప్రదేశ్ లో వైసీపీ మళ్లీ పుంజుకుంటున్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కోల్పోయిన స్థానాలను తిరిగి నిలబెట్టుకునే దిశగా ఫ్యాన్ పార్టీ అడుగులు వేస్తుంది. అయితే అన్ని ప్రాంతాల్లో కాదు. ప్రస్తుతం రాయలసీమలో మాత్రం వైసీపీ బలం క్రమంగా పెరుగుతున్నట్లు అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఏడాదిలోనే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో సీన్ ఛేంజ్ అయినట్లు కనిపిస్తుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుపర్చకపోవడంతో పాటు ఆధిపత్య పోరు రాయలసీమలో నేతల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. అదే కూటమి పార్టీ విజయానికి ఇబ్బందికరంగా మారుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
గత ఎన్నికల్లో...
రాయలసీమలో నాలుగు జిల్లాలున్నాయి. చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో నాలుగు జిల్లాల్లో కేవలం ఏడు చోట్ల మాత్రమే గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలోనూ కేవలం మూడు స్థానాల్లోనే గెలిచింది. అనంతపురం జిల్లాలో పథ్నాలుగు నియోజకవర్గాలుంటే ఒక్క స్థానంలోనూ గెలవలేదు. కర్నూలు జిల్లాలో పన్నెండు స్థానాల్లో ఉంటే వైసీపీ రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. చిత్తూరు జిల్లాలో పథ్నాలుగు స్థానాలుంటే కేవలం వైసీపీ రెండు స్థానాలకే పరిమితమయింది. మిగిలిన పన్నెండు స్థానాలను కూటమి గెలుచుకుంది.
నేతల మధ్య సఖ్యత కొరవడి...
కూటమి పార్టీలు గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేయడంతో పాటు అందరూ కలసి సమన్వయంతో పనిచేయడం కూడా గత ఎన్నికల్లో గెలుపునకు కారణంగా చెబుతున్నారు. అయితే మంత్రి పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పోస్టుల వరకూ కూటమి నేతల్లో అసంతృప్తి పెరిగిందంటున్నారు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నప్పటికీ నేతల మధ్య కీచులాటలు ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. మూడు పార్టీల నేతలకు నియోజకవర్గాల్లో పొసగడం లేదు. తమ వల్లనే గెలుపు సాధ్యమయిందని నమ్మిన నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత తమ వారికి అన్యాయం చేసి వేరే వారికి, ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
నలభై నియోజకవర్గాల్లో...
దీంతో రాయలసీమలోని దాదాపు నలభై నియోజకవర్గాల్లో కూటమి నేతలకు మధ్య యుద్ధం నేరుగానే జరుగుతుంది. ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి కనిపించడం లేదు. తాము సీట్లను త్యాగం చేసి కూటమి పార్టీలకు కట్టబెట్టినా వారు కేర్ చేయడం లేదన్న భావన అన్ని పార్టీల్లో నెలకొంది. దీంతో నియోజకవర్గాల్లో కూటమికి కష్టాలు మొదలయ్యాయంటున్నారు. ఇక ఎమ్మెల్యేలపై కూడా ఏడాది కాలంలోనే వ్యతిరేకత పెరగడం కూడా రాయలసీమలోనే ఎక్కువగా జరుగుతుందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి కలసి రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినా ఇక్కడ మాత్రం నేతలు ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి లేదని అధికార పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మరోవైపు జగన్ పట్ల సానుభూతి కూడా క్రమంగా పెరుగుతుండటంతో రాయలసీమలో వైసీపీకి కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు.
Next Story

