Mon Mar 23 2026 19:43:15 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : నా అజెండా ఆస్తులు కాదు.. ఆస్తుల కోసమే అయితే?
వైఎస్ వివేకా హత్య కేసు వచ్చినప్పుడల్లా వైసీపీ నేతలు ఆస్తుల వివాదాన్ని తెస్తున్నారని వైఎస్ షర్మిల తెలిపారు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తావన వస్తే చాలు, వైసీపీ నేతలు ఆస్తుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం సొంత కుటుంబాన్ని, తల్లిని కూడా విమర్శించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆస్తుల కోసం తాను పాకులాడటం లేదన్నారు. ఆస్తులు అనుభవించాలనే కోరిక తనకే ఉంటే ఎప్పుడో కోర్టు మెట్లు ఎక్కేదానినని షర్మిల స్పష్టం చేశారు. తన అజెండా ఆస్తులు కాదని, అవే తన ప్రాధాన్యత అయితే ఈ పోరాటం చేసేదాన్ని కాదని షర్మిల తెలిపారు.
మరొకరి ఆస్తిని అనుభవిస్తోంది జగనే...
ఇంకొకరి ఆస్తిని అనుభవిస్తోంది తాను కాదని జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్ షర్మిల అన్నారు. ఆస్తుల పంపకాలు, కుటుంబ పరిస్థితులపై తల్లి విజయమ్మ ఇచ్చిన లేఖను తప్పుబట్టడంపై షర్మిల ఘాటుగా స్పందించారు. ఒత్తిడి చేశాననడం హాస్యాస్పదమని "నేను ఒత్తిడి చేసి సంతకం చేయించానని ఆరోపిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. 'ఆ సంతకం నాది కాదు' అని విజయమ్మ చెప్పలేరా? ఆమెకు ఆ స్వేచ్ఛ లేదా? జగన్కు దమ్ములేదా?: లేఖలోని విషయాలు వాస్తవమని తెలుసు కాబట్టే జగన్ మాట్లాడటం లేదు. తన 'సోషల్ మీడియా సైన్యం' వెనుక దాక్కుని మొరుగుతున్నారు. నేరుగా వచ్చి మాట్లాడే ధైర్యం జగన్కు ఉందా? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో న్యాయం జరగాలన్నదే తన ప్రధాన అజెండా అని, ఆస్తుల గొడవను ముందుకు తెచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలని చూడొద్దని షర్మిల హెచ్చరించారు.
Next Story

