Tue Jan 06 2026 19:58:24 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : అవును.. వాళ్లిద్దరూ ఒకటయ్యారా? ఇందులో నిజమెంత?
YSRCP : అవును.. వాళ్లిద్దరూ ఒకటయ్యారా? ఇందులో నిజమెంత?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సోదరి షర్మిలకు మధ్య రాజీ కుదిరిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల కాలంలో వైఎస్ షర్మిల జగన్ పై విమర్శలు తగ్గించడం కూడా ఈ అనుమానాలకు కారణమని చెప్పాలి. గత ఎన్నికల సందర్భంగా తన తల్లిని, చెల్లిని దూరం చేసుకుని పార్టీతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ అయిందని గ్రహించిన జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. త్వరలోనే జగన్ కుటుంబ సభ్యులుందరూ కలసి పోతారన్న టాక్ కూడా పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు కనిపిస్తున్నాయి. రాజకీయంగా విడిపోయి, ఆస్తుల విషయంలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఎవరూ పొలిటికల్ గా ఎదగలేకపోయారన్న భావన ఇరువురిలోనూ నెలకొందని అంటున్నారు.
వైఎస్ కు సన్నిహితులైన...
అందుకే వైఎస్ సన్నిహితులైన కొందరు సీనియర్లు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వారు వైఎస్ కుటుంబాన్ని ఏకం చేయాలన్న లక్ష్యంతో గత కొంత కాలంగా పనిచేస్తున్నట్లు తెలియవచ్చింది. వైఎస్ జగన్ తో వారు ప్రత్యేకంగా బెంగళూరుకు వెళ్లి మాట్లాడిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న వైఎస్ షర్మిలను కూడా కలసి అన్ని సర్దుకుపోయేలా ఇరువురిని ఒప్పించేలా చర్యలు తీసుకున్నట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ఆస్తుల వివాదంలో కూడా పంచాయతీ కలసి కూర్చుని పరిష్కరించుకోవాలని ఇద్దరికీ సూచించడమే కాకుండా రాజకీయంగా ఇద్దరూ ఒకటిగా ఉంటేనే గెలుపు సాధ్యమవుతుందని నచ్చ చెప్పడంలో ఎనభై శాతం వరకూ సక్సెస్ అయ్యారని తెలిసింది.
త్వరలోనే ప్రకటన...
అందుకే ఇటీవల జగన్ పుట్టిన రోజు నాడు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలపడం, దానికి జగన్ కూడా థ్యాంక్యూ అమ్మా అంటూ రిప్లై ఇవ్వడాన్ని ఈ సందర్భంగా కొందరు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైఎస్ షర్మిల ఇటీవల కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తుండటం కూడా అందులో భాగమేనని అంటున్నారు. కుటుంబ విభేదాలు పక్కన పెట్టి, వారసత్వ పోరును కొద్ది రోజులు ఆవల నెట్టి, ముందు రాజకీయాల్లో ఎదుగుదల ధ్యేయంగా కలసి పనిచేయాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు సూచించారని, అలాగే వైఎస్ కుటుంబంలోని పెద్దలు కూడా ఈ పంచాయతీని పరిష్కరించారంటున్నారు. అంతా ఒకే అయితే త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముందని అంటున్నారు. మొత్తం మీద అన్నా చెల్లెళ్లు ఒక్కటయినట్లేనని వైసీపీ నేతలు బాహాటంగా చెబుతుండటం విశేషం. మరి ఇందులో వాస్తవమేంటన్నది చూడాల్సి ఉంది.
Next Story

