Tue Aug 09 2022 22:37:14 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వంపై కుట్రలు జరుగుతున్నాయ్

ప్రభుత్వంపై కుట్రలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళంలో జరిగిన అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. దుష్ట చతుష్టయంతో ఒకే ఒక్క జగన్ యుద్ధం చేస్తున్నాడని అన్నారు. ప్రజల ఆశీస్సులున్నంత వరకూ ఎవరూ వెంట్రుకను పీకలేరని జగన్ మండి పడ్డారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5ల ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. అందరూ తమ కుటుంబంలో మంచి జరిగిందా? లేదా? అని ఆలోచించాలని జగన్ కోరారు. ఎవరికీ భయపడనని, ప్రజల సంక్షేమమే తన ముఖ్యమని జగన్ అన్నారు. జిల్లాలోని కోడి శ్రీరామమూర్తి స్టేడియం మరమ్మత్తులకు పది కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ కార్యాలయం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నానని చెప్పారు. శ్రీకాకుళం - ఆముదాల వలస నాలుగు లేన్ల అభివృద్ధికి 18 కోట్లను మంజూరు చేస్తున్నానని జగన్ చెప్పారు.
75 శాతం హాజరు ఉంటే...
75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకం అందుతుందని తెలిపారు. కరోనా కారణంగా ఈ నిబంధన రెండేళ్లు అమలు చేయకపోయినా, ఈ ఏడాది మాత్రం ఆ నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. హాజరు 75 శాతం లేని 51 వేల మందికి ఈ ఏడాదికి అమ్మఒడి పథకం దక్కనందుకు విచారం చేస్తున్నానని చెప్పారు. మేడేళ్లలో అమ్మఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో 19,618 కోట్లు జమచేశామన్నారు. ఈరోజు తల్లుల ఖాతాల్లో 6,595 కోట్లు జమ చేస్తున్నానని చెప్పారు.
బైజూస్ ద్వారా...
చదువు మీద పెట్టే ప్రతి పైసా పెట్టుబడిగా మారాలని జగన్ ఆకాంక్షించారు. తమ పిల్లలను రోజూ బడికి పంపిస్తే వారు చదువులో ముందుంటారన్నారు. విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించడానికి ముందుకు రావాలన్నారు. చదువు మీద పెట్టే ప్రతి రూపాయి వారి తలరాతలను మారుస్తుందని జగన్ అన్నారు. పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలన్నారు. అప్పుడే వారి జీవితాలు బాగుపడతాయని చెప్పారు. విద్యలో మరింత నాణ్యత పెంచేందుకు బైజూస్ తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ట్యాబ్ లు కూడా విద్యార్థులకు ఉచితంగా ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమయందన్నారు. బైజూస్ యాప్ ద్వారా 4వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు మరింత సులువుగా అర్థమయ్యే రీతిలో విద్యాబోధన జరుగుతుందన్నారు.
Next Story