Sat Mar 07 2026 16:10:46 GMT+0530 (India Standard Time)
Ys Jagan : జగన్ పాదయాత్ర కొనసాగుతుందా? పెద్ద డౌట్
వైఎస్ జగన్ పాదయాత్ర ఈసారి సాగుతుందా? అన్నది అనుమానం వ్యక్తమవుతుంది

వైఎస్ జగన్ పాదయాత్ర ఈసారి సాగుతుందా? అన్నది అనుమానం వ్యక్తమవుతుంది. జగన్ పై రానున్న కాలంలో వరస కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అనేక కేసులకు సంబంధించి జగన్ పాత్రపై లోతుగా అధ్యయనం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గతంలో జగన్ తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉంచారని, అలాగే జగన్ నుకూడా జైలుకు పంపాలని టీడీపీ కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం పదే పదే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఎవరినీ వదిలిపెట్టబోమని చెబుతుండటంతో ఈ ప్రచారానికి మరింత ఊపందుకుంది.
లోకేశ్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ...
మరొకవైపు ఇటీవల నారా లోకేశ్ కూడా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ పేరు రెడ్ బుక్ లో ఉన్నదీ లేనిదీ త్వరలోనే తెలుస్తుందని చెప్పడాన్ని కూడా వైసీపీ నేతలు ఉదహరిస్తున్నారు. జగన్ చుట్టూ ఉచ్చు మామూలుగా బిగుసుకోవడం లేదని, అయితే ఇప్పుడు జగన్ పెద్దగా జనంలో లేరు. బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నారు. వచ్చే ఏడాది నుంచి పాదయాత్రకు వెళతానని జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆ సమయంలోనే జగన్ ను జైలుకు పంపితే బాగుంటుందని అధికార పార్టీ ఆలోచనల్లో ఉన్నట్లు వైసీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. కానీ అది తమ పార్టీ అధినేత జగన్ తో పాటు పార్టీకి కూడా మరింత సానుభూతి తెచ్చిపెడుతుందని అంటున్నారు.
ఉన్న కేసుల్లో కదలిక...
కానీ గత ప్రభుత్వంలో జగన్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం ప్రజలపై ఏ మేరకు ప్రభావం చూపాయన్నది కూలంకషంగా చెప్పిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటే మంచిదన్న యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. ఏ మాత్రం సానుభూతి రాకుండా చేసుకోవడానికి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఇప్పటి వరకూ జగన్ పై పెండింగ్ లో ఉన్న కేసుల విషయంలో కొన్నింటిలోనైనా కదలిక తీసుకు రావాలన్న ప్రయత్నంలో కూటమి నేతలున్నారని వైసీపీ నేతలు తమ కార్యకర్తల ఎదుట బాహాటంగానే చెబుతున్నారు. దీంతో వచ్చే ఏడాది జగన్ పాదయాత్ర సాగే అవకాశం లేదని, ముందుగానే అందరూ పార్టీ బలోపేతానికి సిద్ధమయి ఉండాలని వైసీపీ నేతలు అంతర్గత సమావేశాల్లో క్యాడర్ కు చెబుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?
Next Story

