Fri Dec 05 2025 16:45:18 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఆంక్షలు.. నిబంధనలే జగన్ కు క్రేజ్ తెచ్చి పెడుతున్నాయా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కూటమి ప్రభుత్వం క్రేజ్ తెచ్చిపెడుతున్నట్లుంది.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కూటమి ప్రభుత్వం క్రేజ్ తెచ్చిపెడుతున్నట్లుంది. నిబంధనలు, పోలీసుల ఆంక్షలు అంటూ షరతులు విధిస్తుండటంతో వైసీపీ శ్రేణులు దానికి రెస్పాన్స్ చేతల్లో చూపుతున్నట్లుంది. ప్రస్తుతం విశాఖపట్నం చేరుకున్న జగన్ కూడా రోడ్డు మార్గాన నర్సీపట్నం బయలుదేరిన పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. పోలీసు ఆంక్షలను లెక్క చేయడం లేదు. నిబంధనలు పాటించడం లేదు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఎన్ఏడీ జంక్షన్ మీదుగా అనకాపల్లి మీదుగా నర్సీపట్నానికి చేరుకోబోతున్నారు. అయితే విశాఖపట్నంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో పోలీసులకు కూడా ఇబ్బందిగా మారింది.
జగన్ బయటకు వచ్చినప్పుడల్లా...
వైఎస్ జగన్ బయటకు వచ్చినప్పుడల్లా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఈ రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. గుంటూరులోని మిర్చియార్డును సందర్శించిన సమయంలో కానీ, పొదిలిలో పొగాకు బోర్డు వద్దకు వచ్చినప్పుడు కానీ, చిత్తూరులోని బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించేందుకు వచ్చినప్పుడు కానీ, పల్నాడు జిల్లా పర్యటనలోనూ పోలీసులు చూపిన అత్యుత్సాహం జగన్ కు మరింత క్రేజ్ తెచ్చిపెట్టిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. జగన్ పర్యటనలను చూసీ చూడనట్లు వదిలేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదని, కానీ కొందరు పోలీసు ఉన్నాధికారుల అత్యుత్సాహం వల్లనే జనాలు అత్యధిక సంఖ్యలో రావడానికి కారణమయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
గతంలో చంద్రబాబుకు సయితం...
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే సాగుతుంటాయి. గతంలోనూ చంద్రబాబు నాయుడు సభలకు నాటి వైసీపీ ప్రభుత్వం ఆంక్షలతో ఇబ్బందులు పెట్టబట్టే కూటమి ప్రభుత్వం అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ బయటకు వచ్చినంత మాత్రాన ఏమీ జరగదని, నేరుగా అక్కడకు వెళ్లి తాను పరామర్శకో, పరిశీలన చేసుకుని వెళతారని, అలా కాకుండా ఆంక్షలు, షరతులు గట్టిగా పెట్టినప్పుడే ఇంకా పార్టీ కార్యకర్తల్లో కసి పెరిగి అత్యధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న జగన్ రోడ్డు మార్గాన బయలుదేరినప్పటికీ అత్యధిక సంఖ్యలో జనం తరలి రావడానికి ఇదే కారణమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Next Story

