Ys Jagan : జగనన్న ఇది సరైన సమయమేనా? క్యాడర్ బయటకు వస్తుందా?
వైఎస్ జగన్ సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు వెళతామంటున్నారు.పార్టీ కార్యకర్తలతో జగన్ సమావేశమవ్వాలని నిర్ణయించారు

వైఎస్ జగన్ సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు వెళతామంటున్నారు.పార్టీ కార్యకర్తలతో జగన్ సమావేశమవ్వాలని నిర్ణయించారు. ప్రతి బుధ, గురువారాల్లో కార్యకర్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతి రోజూ మూడు నుంచి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించారు. అలాగే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జగన్ సమీక్ష చేయనున్నారు. ఆయన అధికారికంగా చేసిన ప్రకటన ఇది. అంటే ఆయన జనంలో ఉండేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకున్న నిర్ణయంగానే చూడాలి. అలాగే క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు ఆయన చేస్తున్న తొలి ప్రయత్నం ఇది అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఆయన కార్యకర్తలను పట్టించుకోలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కార్యకర్తలతో భేటీకి జగన్ సిద్ధమవుతున్నారు.
అధికారంలో ఉన్న ఐదేళ్లూ…
గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్ కార్యకర్తలను పూర్తిగా పట్టించుకోకుండా వదిలేశారు. వారిని అస్సలు నేతల నుంచి జగన్ వరకూ ఎవరూ పట్టించుకోవడం లేదు. క్యాడర్ నుచూసి పురుగులును చూసి చూశారు. కనీసం వారు పడ్డ కష్టానికి సాయం చేయాలని కూడా జగన్ కానీ నేతలు కానీ ఆలోచించలేదు. పూర్తిగా తనను రెండోసారి వాలంటీర్లు అధికారంలోకి తెస్తారని భావించారు. వాలంటీర్లతో పాటు తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు, బటన్ నొక్కుడు కార్యక్రమాలు తనను మరోసారి అందలం ఎక్కిస్తాయన్న భ్రమలో పడి జెండా మోసిన కార్యకర్తలను పట్టించుకోలేదు. దీంతో మొన్నటి ఎన్నికల సమయంలో కార్యకర్తలు పెద్దగా పట్టించుకోలేదు. పార్టీకి పోటీ చేసిన అభ్యర్థులకు చెందిన ముఖ్య అనుచరుల హడావిడి మాత్రమే పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించింది. చొక్కాలు చించుకుని ఎవరూ ముందుకు రాలేదు. అందుకే అనేక పోలింగ్ కేంద్రాల వద్ద కూటమి పార్టీలదే పై చేయిగా మారింది. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లోనూ క్యాడర్ మొహం చాటేసింది.
ఫలితాల అనంతరం…
ఎన్నికల ఫలితాల తర్వాత అసలు విషయం అర్థమయింది. జగన్ కు క్యాడర్ పార్టీ గెలుపునకు ఎంత ముఖ్యమో అవగతమయింది. క్యాడర్ లేనిదే లీడర్లు లేరు. లీడర్లు లేనిదే పార్టీ లేదన్న విషయాన్ని జగన్ గుర్తించడానికి ఇన్నాళ్లు సమయం పట్టింది. అయితే ఐదేళ్లు పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత, వారు ఆర్థికంగా చితికపోయిన తర్వాత కార్యకర్తల్లో తిరిగి నూతనోత్తేజం నింపాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే జగన్ ను నమ్మి బయటకు వస్తే కేసులు తమపై నమోదవుతాయన్న భయం క్యాడర్ లో ఉంటుంది. అందుకే కరడుగట్టిన వారు తప్ప సానుభూతి పరులు, జగన్ ను అభిమానించే వారు ఎవరూ అటువైపు చూడరన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఏపీ ఎన్నికలు జరిగి ఐదు నెలలు కాలేదు. ఇంకా నాలుగున్నరేళ్లు ఎన్నికలకు సమయం ఉంది. ఈ టైంలో బయటకు వచ్చి జిందాబాద్ లు కొడితే జైలు తప్పదన్నబెంగ క్యాడర్ లో ఉంటుంది.
క్యాడర్ సహకరిస్తుందా?
అందుకే జగన్ జిల్లా పర్యటనలకు క్యాడర్ అనుకున్న స్థాయిలో రాకపోవచ్చన్న భావన పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతుంది. జగన్ ను నమ్మి, స్థానిక నేతలను విశ్వసించి జనంలోకి జెండా పట్టుకుని వస్తే కష్టాలు పడేది తామేనని వారికి తెలుసు. అందుకే మనసులో అభిమానం ఉన్నప్పటికీ ఇంత త్వరగా బయటపడి తాము ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకన్న భావన ఖచ్చితంగా కార్యకర్తల్లో ఉంటుంది. అందుకే జగన్ జిల్లా పర్యటనలకు ఇది సరన సమయం కాదంటున్నారు. ఇంకా కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి హామీలు అమలుపర్చకుండా కొంత కాలం నెట్టుకొస్తే,ప్రజల్లో అసంతృప్తి మరింత పెరుగుతుందని, అప్పుడు జగన్ పర్యటనలకు వెళితే మరింత ఉత్సాహంగా క్యాడర్ పాల్గొనే అవకాశముంటుందని పార్టీ నేతలే చెబుతున్నారు. జగన్ ఇప్పటి నుంచి జిల్లాల పర్యటనకు వస్తే అనవసరపు ఖర్చు తప్ప మరో ప్రయోజనం ఉండదని కూడా చెబుతున్నారు. అందుకే జగన్ పర్యటనలకు క్యాడర్ నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండకపోవచ్చని, కేవలం అభిమానులు, జనం మాత్రమే హాజరవుతారన్న అంచనాలు వినిపడుతున్నాయి

