Fri Dec 05 2025 22:51:10 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ ఇక ఒంటరిగా మారనున్నారా? చుట్టూ ఉన్న నేతలే టార్గెట్ అవుతున్నారా?
వైఎస్ జగన్ . ఒకవైపు కుటుంబంలో గొడవలు, మరొక వైపు పార్టీలో సంక్షోభం కూడా జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయి

వైఎస్ జగన్ ఒంటరి అయిపోతున్నారు. ఒకవైపు కుటుంబంలో గొడవలు, మరొక వైపు పార్టీలో సంక్షోభం కూడా జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయి. వైఎస్ జగన్ 2019 ఎన్నికలకు ముందు వరకూ ఆయన ఇమేజ్ కు తిరుగులేకుండా ఉంది. గెలిచిన తర్వాత జగన్ యాటిట్యూడ్ తో అనేక మంది నేతలు నేడు దూరమవుతున్నారు. అసంతృప్తిగా ఉన్న నేతలను పసిగట్టి వారిని నయానో, భయానో బెదిరించి పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే అనేక మంది నేతలు దూరమయ్యారు. మోపిదేవి వెంకటరమణ లాంటి నేతలు దూరమయినప్పుడు జగన్ కొంత ఆలోచించి మిగిలిన సభ్యుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
ముగ్గురు రాజీనామా చేసినా...
కానీ ముగ్గురు సభ్యులు రాజీనామా చేసినప్పటికీ జగన్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పాటు అసలు నేతలకు అందుబాటులో లేకపోవడం కూడా ఈ రాజీనామాలకు కారణంగా చూడాలి. విజయసాయిరెడ్డి రాజీనామాను ఎవరూ ఊహించి ఉండరు. కలలో కూడా ఇది జరుగుతుందని భావించి ఉండరు. ఎందుకంటే తొలి నుంచి జగన్ తో ఉన్న అనుబంధంతో పాటు ఆయనతో జరిపిన ప్రయాణాన్ని చూసిన ఎవరికైనా ఇదేరకమైన సందేహలు కలుగుతున్నాయి. కేసులు చుట్టుముడుతాయన్న భయం కావచ్చు. లేకుంటే జగన్ వద్ద ఉంటే తగిన భరోసా లభించదన్న ఆలోచన కావచ్చు. ముఖ్యమైన నేతలు జగన్ ను విడిచి వెళుతున్నారంటే ఏదో జరుగుతుందన్నది ఇప్పటికైనా జగన్ తెలుసుకుంటే మంచిది.
ఆషామాషీ కాదు...
విజయసాయిరెడ్డి రాజీనామా ఆషామాషీ జరిగింది కాదు. ఎందుకంటే రెండుసార్లు రాజ్యసభ పదవి ఇవ్వడంతో పాటు మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు టిక్కెట్ ఇచ్చిన జగన్ ను వదలి వెళ్లడమంటే అంతకంటే బలమైన కారణం ఏదో ఉండి ఉంటుందన్న భావన వైసీపీ నేతల్లో కలుగుతుంది. రాజ్యసభలో బలం కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. మొన్న ముగ్గురు వైసీపీ సభ్యులు రాజ్యసభకు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు రాజీనామా చేసినా తిరిగి వారిలో ఇద్దరికి రాజ్యసభకు అవకాశం కల్పించారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో మరొక సీటు కూటమి ఖాతాలో పడనుంది.
మరికొందరు కూడా...
ఇక ఉన్నసభ్యుల్లో ఎవరు వెళతారన్న దానిపై ఆసక్తికర చర్చ వైసీపీలోనే జరుగుతుంది. గుంటూరు జిల్లాకుచెందిన బడా పారిశ్రామికవేత్త పేరు బలంగా వినిపిస్తుంది. ఆయన కూడా త్వరలో వైసీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఆయనతో పాటు మరికొందరు రాజ్యసభ సభ్యులు కూడా పార్టీని వీడే అవకాశాలు లేకపోలేదు. జగన్ జనంలోకి వెళ్లకముందే మానసికంగా ఇబ్బంది పెట్టాలని ప్రత్యర్థులు ఆడుతున్న నాటకంలో వైసీపీ నేతలు పావులుగా మారుతున్నారన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. మొత్తం మీద విజయసాయిరెడ్డి పార్టీని వదలి వెళ్లడమంటే ఇక జగన్ పక్క ఉండేదెవరు? అన్న ప్రశ్నకు మాత్రం నేతలనుంచి నో కామెంట్ అని మాత్రమే సమాధానం వినిపిస్తుంది. మరి ఏపీరాజకీయాల్లో ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story

