Sun Dec 08 2024 07:13:25 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ వెయిట్ చేస్తుంది అందుకేనా? ఆ సమయం కోసమేనా?
వైఎస్ జగన్ జనంలోకి వచ్చేందుకు రోడ్డు మ్యాప్ సిద్ధం చేశారు. జనవరి మూడో వారం నుంచి పర్యటనలకు సిద్ధమయ్యారు
వైఎస్ జగన్ జనంలోకి వచ్చేందుకు రోడ్డు మ్యాప్ సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావడంతో ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ముగిసిపోయిందన్న ఆలోచనలో జగన్ ఉన్నారని తెలిసింది. తాను జిల్లాల పర్యటనలను చేపడితే అనవసర రాద్ధాంతం కావడంతో పాటు అసలు సమస్యలు పక్క దారి పడతాయని వైఎస్ జగన్ ఇన్నాళ్లూ భావించారు. ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రభుత్వం ఏదో ఒక వివాదాన్ని తనపై నెట్టి ప్రజల మనసులను మళ్లిస్తుందనే ఆయన బెంగళూరుకే పరిమితమయ్యారంటున్నారు. లేకుంటే ఈ పాటికే తాను జిల్లాల పర్యటనలు చేసేవాడినని సీనియర్ నేతలతో జగన్ అన్నట్లు తెలిసింది. తాజాగా జగన్ జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన చేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తం 26 జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.
పర్యటనలు చేపడితే...
జగన్ ఆలోచనలో కొంత వాస్తవం కూడా ఉంది. జగన్ నిజంగానే ముందుగానే పర్యటనలు ప్రారంభిస్తే ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సి వస్తుంది. అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ మొదలవుతుంది. ఏమీ లేకుండానే గత ప్రభుత్వం ఊసు లేకుండా ఈ ప్రభుత్వం ఏ పని చేయడం లేదు. అన్ని తప్పులను తమపై నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ గ్రౌండ్ రియాలిటీలో వాస్తవ పరిస్థితులు ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని జగన్ అంటున్నారట. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్న ఉక్రోశంతో పాటు ఆక్రోశం కూడా జనాల్లో మెల్లగా మొదలయిందన్నారు. అది మరింత తీవ్రమవ్వాలని జగన్ వెయిట్ చేశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఐదు నెలలు కావస్తుండటంతో ఇక జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాటు కార్యకర్తలతో పాటు నేతలకు కూడా తాడేపల్లిలో జగన్ అందుబాటులో ఉంటూ వారి సలహాలు, సూచనలు తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
హడావిడి చేసినా...
ఇన్నాళ్లు తాము హడావిడి చేసినా ప్రయోజనం ఏమీ ఉండదని జగన్ నిన్నటి వరకూ భావించారు. చంద్రబాబు ప్రయారిటీలు వేరు. ఆయన ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణంపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు. నిధులు కూడా అక్కడే వెచ్చిస్తారు. సంక్షేమాన్ని పక్కన పెట్టైనా సరే ఈసారి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు పూనుకుంటారని వైఎస్ జగన్ అంచనా వేశారు. అనుకున్నట్లే అలాగే జరుగుతుంది. జగన్ కు కావాల్సింది కూడా అదే. సంక్షేమాన్ని ఎంత విస్మరిస్తే అంత తనకు మంచిదన్న అభిప్రాయంలో జగన్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. ఊరికే తాము విమర్శలు చేసినా ప్రయోజనం ఉండదని, కంఠశోష తప్పించి ఎలాంటి ఫలితాలు ఉండవన్న నమ్మకంతోనే జగన్ ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉంటూ ట్వీట్లకే పరిమితమయ్యారు.
ఇదే రీజన్...
మరోవైపు నేతలు ఎవరు వెళ్లిపోయినా పట్టించుకోక పోవడానికి మెయిన్ రీజన్ అదేనంటున్నారు. ఎంత మంది వెళితే అంత మంచిదని భావిస్తున్నారు. ప్రజల్లో తనకు, తన పార్టీకి సానుభూతి లభిస్తుందని జగన్ అంచనా వేస్తున్నారు. ఉచిత ఇసుక విధానంతో పాటు కొత్త లిక్కర్ పాలసీ వంటి వాటితో కూడా ఒకవర్గం ప్రజల నుంచి తమకు మద్దతు లభించే అవకాశాలున్నాయని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ప్రజల్లో అసంతృప్తితో పాటు అధికార పార్టీ చేసే తప్పులు కూడా తమకు కలసి వస్తాయనే వైఎస్ జగన్ అనుకుంటున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే జగన్ ఆలస్యం చేసే కొద్దీ నేతలు వెళ్లే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం అంటున్నారు. అందుకే జనవరి మూడో వారం నుంచి జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పార్టీ ఓటమికి గల కారణాలను కూడా జిల్లాల పర్యటనలో సమీక్షించనున్నారు. అందుకే సంక్రాంతి పండగ పూర్తయిన తర్వాత తన పర్యటనలకు శ్రీకారం చుట్టాలని జగన్ నిర్ణయించారని తెలిసింది.
Next Story