Fri Dec 05 2025 09:56:30 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : బిల్డప్ బాబు ముఖారవిందాన్ని చూసి గూగుల్ విశాఖకు వచ్చిందా?
వైసీపీ ప్రభుత్వం, అదానీ, సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి వల్లనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు.

వైసీపీ ప్రభుత్వం, అదానీ, సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి వల్లనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేయాలని నాడు అదానీతో పాటు సింగపూర్ ప్రభుత్వంతో కూడా తాము చర్చించామని జగన్ తెలిపారు. గూగుల్ కు, అదానీకి వ్యాపార భాగస్వామ్యం అనేది 2022 లోనే ఉందని, నోయిడాలో ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని అనుకున్నారని జగన్ అన్నారు. 2023 మే 3న విశాఖలో శంకుస్థాపన చేశామని, సబ్సీ కేబుల్ కు కూడా అప్పుడే అంకురార్పణ జరిగిందని జగన్ చెప్పారు. అదానీకి 2021లో సబ్సీకేబుల్ కోసం ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం లేఖ రాసిందని చెప్పుకొచ్చారు.
పెరఫార్మన్స్ లో బాబు వీక్...
చంద్రబాబు వ్యవహారం పెరఫెర్మాన్స్ లో వీక్.. క్రెడిట్ లో పీక్ లా ఉందని వైఎస్ జగన్ తెలిపారు. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని జగన్ అన్నారు. 2020లోనే విశాఖలో అదానీ డేటా సెంటర్ కు బీజం పడిందని జగన్ తెలిపారు. నాడే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని గూగుల్ ను ఇక్కడకు తీసుకు వచ్చే కార్యక్రమం ప్రారంభమయిందని చెప్పడానికి చంద్రబాబు ఇష్టపడకపోవడం వల్లనే అదానీ పేరును బయటకు రానివ్వలేదన్నారు. డేటా సెంటర్ కు అదానీ 82 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని జగన్ తెలిపారు. సింగపూర్ నుంచి 3,900 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖకు సముద్ర గర్భంలో కేబుల్ వేసుకు రావాలని జగన్ వివరించారు. ఈయన సుందర ముఖారవిందాన్ని చూసి గూగుల్ వచ్చిందని బిల్డప్ చంద్రబాబు ఇస్తున్నాడని అన్నారు.
హైదరాబాద్ తానే కట్టానని..
డేటా సెంటర్ వల్ల వచ్చే ఉపాధి అవకాశాలు తక్కువని అన్నారు. భవిష్యత్ లో జరిగే మార్పునకు డేటా సెంటర్ ముఖ్య భూమిక అని జగన్ అన్నారు. రిక్రియేషన్ సెంటర్, ఐటీ పార్క్, స్కిల్ సెంటర్ పెట్టాలని నాడు అదానీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని జగన్ తెలిపారు. దీనివల్ల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వస్తాయని జగన్ చెప్పారు. హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేసుకుంటున్నానని చెప్పానని అన్నారు. 1999లో గెలిచిన చంద్రబాబు తర్వాత అక్కడ చంద్రబాబు గెలవనే లేదన్నారు. రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు సార్లు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిందని జగన్ చెప్పారు. ఇతర ముఖ్యమంత్రులు చేసిన దానికి కూడా చంద్రబాబు క్రెడిట్ ఇవ్వలేదని జగన్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ పాలన వల్ల ఐటీలో ఎగుమతులు పెరిగాయని జగన్ అన్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఐటీ ఆదాయం ఐదువేల ఆరువందల కోట్లయితే, ఇప్పుడు రెండు లక్షల కోట్లు దాటిందనడానికి కారణమెవరు? అని జగన్ ప్రశ్నించారు.
Next Story

