Mon Jun 23 2025 02:40:32 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : ఏడాదిలో వైసీపీ రేటింగ్ ఎంతో తెలుసా? క్యాడర్ పల్స్ వింటే చాలు?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది గడుస్తుంది. అయితే ఈ ఏడాదిలో వైసీపీ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి ఏడాది గడుస్తుంది. అయితే ఈ ఏడాదిలో వైసీపీ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి లభించలేదు. 175 నియోజకవర్గాలకు గాను కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వైసీపీకి వచ్చాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటయిన శాసనసభ సమావేశాలకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. దీంతో ప్రజాసమస్యలను శాసనసభలో ప్రస్తావించేవారు లేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని జగన్ పట్టుబట్టడం కూడా ప్రజల్లో ఒకరకమైన వ్యతిరేక భావన ఏర్పడింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళతామని అనడం సరికాదన్న కామెంట్స్ బాగానే వినిపిస్తున్నాయి.
వాయిస్ లేకుండా...
శాసనసభలో వైసీపీ వాయిస్ లేకుండా పోయింది. ఇది జగన్ పార్టీకి మైనస్ అని చెప్పాలి. అదేసమయంలో జగన్ ఏడాది నుంచి బెంగళూరు నుంచి విజయవాడ కు ట్రిప్పులు వేస్తున్నారు. నెలలో కొన్ని రోజులు మాత్రమే నేతలకు అందుబాటులో ఉంటున్నారు. స్థానిక సంస్థలను కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవడంతో ఆయన తరచూ లోకల్ లీడర్లతో భేటీ అవుతున్నారు. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా స్థానిక సంస్థలన్నీ కూటమి పరమయిపోయాయి. ఇక ఉగాది నుంచి జిల్లాల పర్యటనలు చేస్తానని ప్రకటించిన వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు తన పర్యటనను వాయిదావేసుకుంటూ వెళుతున్నారు.
నియజకవర్గాల ఇన్ ఛార్జుల విషయంలో...
ఏడాది కూటమి ప్రభుత్వంలో తమ వారిపై నమోదవుతున్న కేసుల విషయంలోనే జగన్ కొంత పట్టించుకుంటున్నారు. ఏడాది నుంచి నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో సమావేశం కాలేదు. అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. చివరకు తన సొంత జిల్లా కడపలోనూ నేతలతో ఆయన సమావేశమవ్వడం తక్కువేనని అంటున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలకు ప్రాధాన్యత నిస్తామని చెబుతున్న జగన్ మాత్రం నేతలకు సంబంధించి ఎటువంటి భరోసా ఇవ్వడం లేదు. గత ఎన్నికల్లో ఇష్టారీతిన నియోజకవర్గాలను మార్చేశారు. నేతలకు పట్టున్న నియోజకవర్గాల నుంచి బయటకు పంపారు. ఈ ప్రయోగం విఫలమయిందని తెలిసినా తిరిగి అక్కడ ఇన్ ఛార్జులను నియమించకపోవడంతో ఏడాదిగా ఆ యా ప్రాంతాల్లో క్యాడర్ అయోమయంగా ఉంది.
గతంలో మాదిరిగా...
మరొక వైపు అప్పుడప్పడు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నప్పటికీ, మీడియా సమావేశాలు పెడుతున్నప్పటికీ జగన్ ఇంకా పూర్తి స్థాయిలో జనానికి అందుబాటులోకి రాలేదు. తాడేపల్లి కేంద్ర కార్యాలయానికే అధికారంలో లేనప్పుడు కూడా పరిమితమయ్యారు. రైతుల సమస్యలపై కొంత వెళుతున్నప్పటికీ జగన్ 2019 ఎన్నికలకు ముందు చేసిన తరహాలో దీక్షలు, ధర్నాలు వంటివి చేయకపోవడం పార్టీ క్యాడర్ లో ఇంకా ఊపు తెప్పించలేకపోతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది జనంలోకి బలంగా వెళ్లగలిగేలా మాత్రం ఆయన చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదన్నది మాత్రం యదార్థం.ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో కనీసం యాభై శాతం కూడా సక్సెస్ కాలేకపోయినట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా.
Next Story