Fri Dec 05 2025 12:39:22 GMT+0000 (Coordinated Universal Time)
Midhun Reddy : మిధున్ రెడ్డి అరెస్టయితే.. తర్వాత ఎవరు?
మద్యం కుంభకోణం కేసులో స్పెషల్ ఇన్విస్టేగేషన్ టీం అధికారుల ఎదుట వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి హాజరయ్యారు

మద్యం కుంభకోణం కేసులో స్పెషల్ ఇన్విస్టేగేషన్ టీం అధికారుల ఎదుట వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడకు చేరుకున్నమిధున్ రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ 4 నిందితుడిగా ఉన్నారు. అయితే మిధున్ రెడ్డిని నేడు విచారణ జరిపి అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మిధున్ రెడ్డిని అరెస్ట్ చేసి రేపు న్యాయస్థానంలో హాజర పర్చిన అనంతరం సిట్ అధికారులు ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. మిధున్ రెడ్డి సిట్ కార్యాలయానికి వస్తుండటంతో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మిధున్ రెడ్డిని మినహా మరెవ్వరికీ అనుమతించే అవకాశం లేదని పోలీసులు తెలిపారు.
ఒకసారి ఇప్పటికే...
మిధున్ రెడ్డి ఇప్పటికే ఒకసారి సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణను ఎదుర్కొన్నారు. అయితే హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్లను డిస్మిస్ చేయడంతో నేడు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మిధున్ రెడ్డి విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నిన్న సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ డిస్మిస్ కావడంతో నిన్ననే సిట్ అధికారులు ఈరోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న మిధున్ రెడ్డి విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి చేరుకోనున్నారు. సిట్ అధికారుల నేడు విచారించి అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది.
అరెస్టయినా బెయిల్ కోసం...
మిధున్ రెడ్డి ఈ కేసులో కీలకమని సిట్ అధికారులు భావిస్తున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. మద్యం కేసులో వసూలు చేసిన సొమ్ములు మిధున్ రెడ్డి కంపెనీలకు డంప్ అయ్యాయని సిట్ అధికారుల విచారణలో తేలడంతో ఆయనను ఈ కేసుల నిందితుడిగా చేర్చారు. మిధున్ రెడ్డిని కనుక ఈరోజు అరెస్ట్ చేస్తే ఏపీ మద్యం కేసులో అరెస్ట్ ల సంఖ్య పన్నెండుకు చేరుకోనుంది. ఇప్పటికే అరెస్టయిన పదకొండు మందికి బెయిల్ రాలేదు. వారంతా జ్యుడిషియల్ రిమాండ్ లో విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. మిధున్ రెడ్డి కూడా అరెస్టయిన తర్వాత తనకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 21 వతేదీ నుంచి ఉన్నందున బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. మిధున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ కేసులో ఎవరు అరెస్ట్ అవుతారన్నది మాత్రం ఉత్కంఠగానే ఉంది.
భయపడబోను...
ఈకేసు రాజకీయ ప్రేరేపితమైన కేసు అని, ఇప్పుడు తనను అరెస్ట్ చేసి కొద్దిరోజులు పాటు ఆనందపడవచ్చేమో కాని, ఇది చట్టం ముందు నిలబడే కేసు కాదని మిధున్ రెడ్డి తెలిపారు. తనను అరెస్ట్ చేసి ఆనందం పొందే వాళ్లకు మాత్రం కొన్ని రోజులే ఉంటుందని చెప్పారు. తాను అరెస్ట్ లకు భయపడే వాడిని కాదని, ధైర్యంగా ఏ కేసునైనా ఎదుర్కొటానని తెలిపారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే తనపై మద్యం కేసులో తనను నిందితుడిగా చేర్చారని ఆయన సిట్ కార్యాలయానికి విచారణకు వెళ్లేముందు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మిధున్ రెడ్డితో పాటు సిట్ కార్యాలయంలోకి న్యాయవాదులను కూడా అనుమతించలేదు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
Next Story

