Sun Dec 14 2025 11:42:36 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ లో ఇంకా ఆ నమ్మకమే ఉన్నట్లుందిగా.. అందుకే నానుస్తున్నారా?
జగన్ తాను మారానని చెబుతున్నప్పటికీ చేతల్లో మాత్రం కనిపించడం లేదన్నది వైసీపీ నేతలే అంటున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈసారైనా నాయకులకు గుర్తింపు, గౌరవం ఇస్తారా? అదే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతుంది. గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు జగన్ నాయకులకు ప్రజల్లో గౌరవం లేకుండా చేసిపారేశారు. వాలంటీర్లను తెచ్చి పెట్టి ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలుగా నిలబెట్టారు. ఏ పని కావాలన్నా వాలంటీర్లే ఉండటంతో ఎమ్మెల్యేలతో పని లేకుండా పోయింది. తానే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తుండటంతో ప్రజలకు, నేతలకు మధ్య కనెక్షన్ కట్ అయింది. జగన్ తనను చూసి జనం ఓటేయాలన్న అత్యాశతో ఎమ్మెల్యేలను గత ఐదేళ్ల పాటు నొక్కి పెట్టారు. అదే ఆయన ఓటమికి కారణమయింది.
ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలుగా...
మొన్నటి ఎన్నికల్లో జనం వద్దకు వెళ్లి తమకు ఓట్లు వేయాలని అడిగేందుకు కూడా ఎమ్మెల్యేలకు అవకాశం లేకుండా పోయింది. జగన్ ను చూసి ఓటేయాలని అనుకున్నప్పటికీ అంతకు మించి చంద్రబాబు ఎన్నికల హామీలు ఇవ్వడంతో జనం అటువైపు చూశారు. అయినా నలభై శాతం ఓటు బ్యాంకు వైసీపీకి వచ్చింది. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు తమ సొంత బలంతో ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. ఎమ్మెల్యేల ప్రమేయం ఉండి ఉన్నా, కార్యకర్తలతో సంబంధాలు న్నా ఇంత పార్టీకి డ్యామేజీ జరిగి ఉండేది కాదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. జగన్ ఓటమి పాలయిన తర్వాత కూడా తన పద్ధతిని మార్చుకోలేకపోతున్నారంటున్నారు.
ఇన్ ఛార్జుల నియామకాలు కూడా...
అధికారంలో లేకపోయినా వైసీపీ స్థానిక నాయకత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులను ముందుగానే ఎంపిక చేసి జనంలోకి పంపితే బాగుంటుందన్న సూచనలు వెలువడుతున్నాయి. అలా జరగకుండా తాను పాదయాత్రతో మళ్లీ వైసీపీని అధికారంలోకి తేవాలని భావిస్తే మాత్రం మరోసారి భంగపాటు తప్పదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జుల నియామకానికి కూడా జగన్ ఆసక్తి చూపడం లేదంటే ఆయన ఇంకా తన ఫొటోను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లుంది. అదే జరిగితే ఈసారి ఎన్నికల్లోనూ అరకొర సీట్లు వస్తాయని చెబుతున్నారు. జగన్ తాను మారారని చెబుతున్నప్పటికీ చేతల్లో మాత్రం కనిపించడం లేదన్నది వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్న టాక్. మరి జగన్ ఇకనైనా మారి నాయకులకు గౌరవం కల్పిస్తేనే అధికారం అందుకునే అవకాశాలుంటయంటున్నారు.
Next Story

