Fri Dec 05 2025 13:18:54 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ జిల్లాల పర్యటనలతో ఇంత మార్పు వచ్చిందా? వైసీపీలో హాట్ టాపిక్
వైసీపీ నేతలు దూకుడు పెంచారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కాలం పూర్తియని తర్వాత గేర్ మార్చినట్లు కనపడుతుంది

వైసీపీ నేతలు దూకుడు పెంచారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కాలం పూర్తియని తర్వాత గేర్ మార్చినట్లు కనపడుతుంది. ఎఫెన్స్ గా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. అందుకే నేతలు మాటకు మాట అంటూ సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతున్నారు. రప్పా రప్పా డైలాగును కాకుండా అనుకున్నది చేసేయాలంటూ క్యాడర్ కు చెప్పే పరిస్థితికి వచ్చారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నేతలు యాక్టివ్ గా ఉండేవారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు వంటి నేతలు కొంత యాక్టివ్ గా కనిపించినప్పటికీ మిగిలన నేతలు మాత్రం పెద్దగా పట్టించుకోకుండా తమ వ్యాపారాలకు మాత్రమే పరిమితమయ్యారు.
మొన్నటి వరకూ విమర్శలకు...
జిల్లా అధ్యక్షులుతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు, గతంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా అధికార పార్టీ ఇచ్చే విమర్శలకు పెద్దగా స్పందించడం లేదు. కేవలం కొందరు మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. జగన్ పొదిలి పర్యటనలో కానీ, రెంటపాళ్ల పర్యటన సమయంలో జరిగిన ఘటనలపై కూడా నేతలు రెస్పాండ్ పెద్దగా కాలేదు. అయితే ఇటీవల కాలంలో మాత్రం నేతలు ఇక బయటకు వచ్చారు. ఇన్నాళ్లు కేసులకు, అరెస్ట్ లకు, జైళ్లకు భయపడిన నేతలు ఇకపై భయపడబోమంటున్నారు. ఎన్నికేసులు పెట్టుకుంటారో పెట్టుకోవాలంటూ సవాళ్లు విసురుతున్నారు. ఎందుకంటే ఇక తాము భయపడితే రానున్న ఎన్నికల్లో క్యాడర్ నిలబడదన్న నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుంది.
టిక్కెట్ తో పాటు...
వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ దక్కడం ఎంత అవసరమో.. అదే సమయంలో క్యాడర్ కూడా ధైర్యంగా రోడ్డు మీదకు వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. నాయకులుగా ఉంటూ తామే వెనకడుగు వేస్తే ఇక కార్యకర్తలు ఎందుకు బయటకు వస్తారన్న భావన పెరిగిపోయింది. మరొక వైపు జిల్లాల పర్యటనకు వస్తుండటం కూడా నేతల్లో మార్పునకు కారణమయింది. జగన్ జిల్లాల పర్యటన విజయవంతం కావాలంటే కార్యకర్తల సహకారం అవసరం. వారు ఏమాత్రం భయపడినా, రాకపోయినా టూర్ ప్లాప్ అవుతుంది. ఆ ప్రభావం తమపై పడుతుందన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతున్నట్లే ఉంది. పొదిలి, సత్తెనపల్లి, చిత్తూరు పర్యటనలు విజయవంతం కావడంతో అంతకు మించి తమ జిల్లాల్లో సక్సెస్ కావాలంటే తాము కూడా ఇక వీధుల్లోకి రావాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది.
బయట ఉన్నవారు కూడా...
అందులోభాగంగానే మొన్నటి వరకూ విదేశాల్లో ఉన్నవారు సయితం ఇప్పుడు సొంత నియోజకవర్గాలకు వచ్చి క్యాడర్ కు అందుబాటులో ఉంటున్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి విదేశాల్లో ఏడాదిగా ఉంటూ ఈ మధ్య నియోజకవర్గానికి వచ్చారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో సయితం జక్కంపూడి బ్రదర్స్ కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అనేక మంది నేతలు బయటకు రావడం వైసీపీకి కొంత సానుకూలత వాతావరణం ఏర్పడింది. జగన్ జిల్లా పర్యటనకు ఎప్పుడు వచ్చినా పూర్తి స్థాయి సక్సెస్ చేయడమే కాకుండా తమ స్థానాలను పదిలం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనపడుతుంది.
Next Story

