Fri Dec 05 2025 14:37:55 GMT+0000 (Coordinated Universal Time)
వెన్నుపోటు దినానికి అనుమతి ఇవ్వండి.. డీజీపీకి వైసీపీ లేఖ
ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది

గత ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఇచ్చిన ఏ హామీని నెరవేర్చక పోవడంతో పాటు, అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈనెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. వెన్నుపోటు దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుత ర్యాలీలు నిర్వహించి, ఆయా చోట్ల ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
అనుమతులు కోరినా...
ఈ కార్యక్రమం కోసం ముందస్తు అనుమతి కోరుతూ, చాలా రోజుల ముందే స్థానికంగా ఆయా పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు చేసినా, ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని, నిరంకుశంగా వ్యవహరిస్తూ, తమ పార్టీ ఆ కార్యక్రమం నిర్వహించకుండా చేయాలని చూస్తున్నారని లేఖలో తెలిపారు. ఇది కచ్చితంగా ‘ఇండియన్ పోలీస్ యాక్ట్. సెక్షన్–30’ ఉల్లంఘన అని గుర్తు చేశారు. ప్రధాన విపక్షంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పూర్తి శాంతియుతంగా తాము తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి చట్ట ప్రకారం అనుమతి ఇవ్వాల్సి ఉన్నా, స్థానిక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, తమ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని వైయస్సార్సీపీ ఆ లేఖలో వెల్లడించింది.
Next Story

