Fri Dec 05 2025 22:48:20 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ స్టాండ్ మారలేదట.. రాజధాని విషయంలో వచ్చే ఎన్నికలకు ఇదే చెబుతారట
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ స్టాండ్ మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది

వైసీపీ అధినేత జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? అంటే లేదనే తెలుస్తుంది. రాష్ట్రం మరోసారి విభజన కాకుండా ఉండాలంటే మూడు రాజధానులు అవసరమని ఇప్పటికీ జగన్ నమ్ముతున్నారు. గత ఎన్నికలకు మూడు రాజధానుల నినాదంతోనే వైఎస్ జగన్ వెళ్లారు. అయితే మూడు ప్రాంతాల ప్రజలు జగన్ పార్టీని ఆదరించలేదు. దీంతో రాజధాని అమరావతి అంశం మూడు ప్రాంతాల్లో పనిచేసిందని వైసీపీ నేతలు కూడా నమ్ముతున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే గెలిచే వారమని చెబుతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ వంటి వారయితే మూడు రాజధానుల కథ ముగిసిందన్నట్లుగా మాట్లాడారు.
అదే ప్రధాన కారణమయితే...
అయితే గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా దెబ్బతినడానికి అమరావతి కారణం కాదని జగన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అమరావతి రాజధాని అంశమే ప్రధానంగా మారితే ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్రలో ఎందుకు ఊడ్చుకుపోతామని ఎదురు ప్రశ్నిస్తున్నారట. అసలు గత ఎన్నికలలో ఓటమికి అమరావతి కారణం మాత్రం కాదని, ఓట్ల శాతం ఒక్కసారిగా పెరగడంతో పాటు ఈవీఎంల వల్లనేనని జగన్ ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారని తెలిసింది. చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి రాజధానికి మాత్రమే నిధులు ఖర్చు చేయడంతో పాటు సంక్షేమ పథకాలను కూడా అమలు చేయకపోవడం, ఇచ్చిన హామీలు కూడా అందచేయకపోవడం తమకు కలసి వస్తుందని అంటున్నారట.
వేల కోట్లు పోసి...
రాజధానిలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా, అక్కడ దశల వారీగా అభివృద్ధి చేయాల్సిన సమయంలో ఒక్కసారి అప్పులు చేసి నిధులు కుమ్మరించడాన్ని కూడా ఇతర ప్రాంతాల ప్రజలు తప్పుపడుతున్నారని జగన్ సీనియర్ నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అందుకే వెన్నుపోటు దినం పిలుపు నిస్తే రాష్ట్రం నలుమూలల ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో కార్యకర్తలు, ప్రజలు వెల్లువెత్తడానికి కూడా కారణం ప్రభుత్వం పెల్లుబుకుతున్న అసంతృప్తి మాత్రమేనని అంటున్నారట. వచ్చే ఎన్నికల్లో కూడా అమరావతి రాజధాని అని మ్యానిఫేస్టోలో పెట్టే అవకాశం మాత్రం కనిపించడం లేదు. అయితే అదే సమయంలో రాజధాని ప్రస్తావన లేకుండానే ఎన్నికలకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారని తెలిసింది.
మరో నలభై వేల ఎకరాలను...
రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఎన్ని నిధులు వెచ్చించినా నాలుగేళ్లలో పనులు పూర్తి కావని, అయితే కొన్ని కీలక సంస్థలను మాత్రం ఇతర ప్రాంతాలకు తరలించడంతో పాటు రాజధానికి మరో నలభై వేల ఎకరాలను సేకరించడం కూడా అనవసరమన్న అభిప్రాయంలో వైఎస్ జగన్ ఉన్నారని చెబుతున్నారు. రాజధాని అంశంపై ఎవరూ మాట్లాడవద్దని కూడా సీనియర్ నేతలకు జగన్ సూచించినట్లు తెలిసింది. దీనిపై పార్టీ స్టాండ్ తాను మాత్రమే ప్రకటిస్తానని, అది అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుందని చెబుతున్నారు. అంతే తప్ప ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు మూడు రాజధానుల నుంచి వెనక్కు మళ్లారని మాత్రం అనుకోవద్దని కూడా జగన్ చెబుతుండటం విశేషం.
Next Story

