Fri Jun 20 2025 00:35:03 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ చేజేతులా పార్టీ నిర్మాణాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్లిప్తత పార్టీ శ్రేణుల్లో నిరాశ నింపుతుంది

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్లిప్తత పార్టీ శ్రేణుల్లో నిరాశ నింపుతుంది. కేవలం తాడేపల్లి కార్యాలయంలో సమావేశాలు పెడితే కుదరదు. పార్టీ ప్లీనరీ జరపాలన్న స్పృహ కూడా జగన్ కు లోపించింది. పార్టీ ప్లీనరీ ఎవరైనా నిర్వహిస్తారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్లీనరీ ఏర్పాటు చేసుకుని పార్టీ బలోపేతం పై చర్చించుకుంటారు. అంతేకాదు పార్టీకి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. ప్లీనరీ ఒకటి రెండురోజులు జరిపితే ఈ కిక్కు వేరుగా ఉంటుంది. పార్టీ క్యాడర్ లో ఉత్సాహం మాత్రమే కాదు.. హాజరయిన కార్యకర్తలను చూసి ప్రత్యర్థులు సయితం ఆశ్చర్యపోతారు. అలాంటిది జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జరిపేందుకు కూడా చేతులు రావడం లేదు. ఆయన ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది.
వైఎస్ జయంతి రోజున...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి జులై ఎనిమిదో తేదీన ప్లీనరీని ఏర్పాటు చేస్తారు. అయితే పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత ప్లీనరీలు అతి కొద్దిసార్లు మాత్రమే నిర్వహించారు. అదీ అధికారంలోకి రాకముందు ఒకటి రెండు సార్లు మాత్రమే నిర్వహించారు. అంతే తప్ప పెద్దగా ప్లీనరీలను నిర్వహించిన దాఖలాలు లేవు. ఎందుకో తొలి నుంచి జగన్ ప్లీనరీ నిర్వహణ పట్ల అంతగా మొగ్గు చూపడం లేదు. ప్రత్యర్థిగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీని తీసుకుంటే అధికారంలో ఉన్నా, లేకపోయినా మహానాడును ఖచ్చితంగా జరుపుతారు. అధికారంలో ఉన్నదానికంటే రెట్టింపు ఉత్సాహంతో అధికారంలో లేనప్పుడు టీడీపీ బాగా జరుపుకుంటుంది. గత ఎన్నికలకు ముందు ఒంగోలులో నిర్వహించిన మహానాడు పార్టీకి మంచి హైప్ తెచ్చిపెట్టింది.
కార్యకర్తలకు ఇష్టమైన...
ఈ సంగతి జగన్ కు తెలియంది కాదు. కానీ ప్లీనరీ ఏర్పాటుకు మాత్రం జగన్ ముందుకు రావడం లేదు. ప్లీనరీ అంటే జగన్ కాదు.. కార్యకర్తలకు పండగ. ఎందుకంటే తమకు ఇష్టమైన పార్టీ ప్లీనరీకి దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి జెండా పట్టుకుని మరీ నినదిస్తారు. కార్యకర్తలకు పార్టీ నాయకత్వం చేసేదేమీ ఉండదు. మంచి భోజనాలు పెట్టడం తప్పించి. అంతకు మించి కార్యకర్తలు కూడా ఏదీ కోరుకోరు. తమ ప్రత్యర్థి పార్టీలు పండగలా ప్లీనరీలు జరపుకుంటుంటే ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు మాత్రం నిరాశగా ప్లీనరీ ఎప్పుడు పెడతారో? నన్న ఆశతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ కొన్ని నిర్ణయాలు ఇలా ఎందుకు తీసుకుంటారన్నది ఎవరికీ అర్థం కానీ విషయం.
ఈ ఏడాది లేదంటూనే...
కానీ మొన్న జగన్ పార్టీ ప్లీనరీపై స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాది ప్లీనరీ లేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలుకు దండలు వేసి మమ అనిపించేయడమేనని పరోక్షంగా చెప్పేశారు. వచ్చే ఏడాది బ్రహ్మాండంగా జరుపుకుందామని చెప్పారు. అయిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకే సారి ప్లీనరీ జరిపారు. ఇలా జగన్ తన నిర్ణయాలతో పార్టీని తానే నిర్వీర్యం చేసుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అప్పడు కూడా తాను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికే. ప్రతి ఏడాది ప్లీనరీ జరుపుతూ ఒక్కో ఏడాది ఒక్కో జిల్లాలో పెడుతుంటే అక్కడ వారికి మాత్రమే కాకుండా పార్టీ క్యాడర్ కు, నేతలకు కూడా ఉత్సాహం కలుగుతుంది. కానీ జగన్ మాత్రం ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం ఆ పార్టీ క్యాడర్ చేసుకున్న పాపమేనని చెప్పాలి.
Next Story