Sun Dec 08 2024 06:34:47 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : వైసీపీలో ఈ నేతలంతా మళ్లీ యాక్టివ్ మోడ్ లోకి.. జగన్ కీలక నిర్ణయం?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి ఆయన అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి ఆయన అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో తాను చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రయోగాలు మంచిది కాదని జగన్ డిసైడ్ అయ్యారు. సీనియర్ నేతల అవసరం ఆయనకు గుర్తుకు వచ్చినట్లుంది. అందుకే ఇటీవల వైసీపీ ముఖ్యనేతల సమావేశంలోనూ జగన్ తన మనసులో అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. తప్పులు జరిగినట్లు ఒప్పుకున్న జగన్ వాటిని మార్చుకునేందుకు తనకు అవకాశం ఉందని, అయితే అదే సమయంలో మీ లో కొందరు నిర్ణయాలు మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం.
ఎడా పెడా మార్చేసి...
అందులో ప్రధానంగా వారసుల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ఇష్టమొచ్చినట్లు అభ్యర్థులను మార్చారు. తన ఫొటో ఉంటే చాలు ఎవరిని నిలబెట్టినా గెలుపు గ్యారంటీ అని భావించారు. అందుకే అనేక మందిని ఎడా పెడా మార్చేశారు. మరోవైపు సీనియర్ నేతలు వారి కోరిక మేరకు పోటీలో ఉండబోనని చెప్పినా జగన్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొందరిని మాత్రం వైఎస్ జగన్ అప్పట్లో అడ్డుకున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన నేతలు, సీనియర్ లీడర్లుగా ఉన్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు పోటీకి విముఖత చూపినా, తమ వారసులను బరిలోకి దింపాలని ప్రయత్నించినా జగన్ అంగీకరించలేదు.
పేర్ని నాని అధ్యక్షుడిని చేసి...
కానీ కొందరి విషయంలో మాత్రం వైఎస్ జగన్ తలొగ్గారు. అందులో సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు. మచిలీపట్నం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచిన పేర్ని నానికి తన కేబినెట్ లో చోటు కల్పించారు. వైసీపికి నాలుకగా పేర్ని నాని మారారు. నాని వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళుతుండటంతో జగన్ అమితంగా పేర్ని నానిని ఇష్టపడ్డారంటారు. అలాంటి పేర్ని నాని తన కుమారుడు పేర్ని కిట్టూకు 2024 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలని, తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని ప్రకటించారు. జగన్ పేర్ని నాని బలవంతం మీద అంగీకరించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో పేర్ని కిట్టూ ఓటమి పాలయ్యారు. ఇటీవలే పేర్ని నానిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్ నియమించారు. అంటే రాజకీయాలకు దూరం కావద్దని, 2029 ఎన్నికలకు పేర్ని నాని పోటీ చేయాలని జగన్ చెప్పకనే చెప్పినట్లయింది.
చెవిరెడ్డి వారసుడిగా...
ఇక చంద్రగిరిలోనూ అంతే జరిగింది. నాటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన రాజకీయ వారసుడిగా కుమారుడు మోహిత్ రెడ్డిని ప్రకటించారు. తాను పార్టీలో క్రియాశీలకంగా ఉంటానని, తన కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి టిక్కెట్ ఇవ్వాలని జగన్ ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరగా అందుకు అంగీకరించారు. కానీ మోహిత్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత అనుకోని పరిస్థితుల్లో చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన కూడా ఓటమి పాలయ్యారు. దీంతో చెవిరెడ్డిని ప్రస్తుతం చంద్రగిరి బాధ్యతలను చూసుకోమని జగన్ అన్నట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం తిరిగి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరికే పరిమితమయ్యారు.
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ....
తిరుపతి నియోజకవర్గంలో భూమన వారసుడు అభినయ్ రెడ్డిని జగన్ మొన్నటి ఎన్నికల్లో రంగంలోకి దించారు. కానీ అభినయ్ రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయాన్ని అభినయ్ రెడ్డి అందుకోలేకపోయారన్న విషయాన్ని గమనించి తిరిగి యాక్టివ్ కావాలని భూమనకు సూచించినట్లు తెలిసింది. తిరుపతి జిల్లా బాధ్యతలను భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. అందుకే ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి తిరిగి పాలిటిక్స్ లో యాక్టివ్ గా కనపడుతున్నారంటున్నారు.మొత్తం మీద తండ్రుల రాజకీయ వారసత్వాన్ని వేగంగా అందిపుచ్చుకోవడంలో విఫలమైన వారసులను జగన్ పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. వారి సేవలను పార్టీ యూత్ వింగ్ కు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
Next Story