Fri Feb 14 2025 11:07:45 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ కు గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతుందా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు గ్రౌండ్ రియాలిటీ పై ఇంకా అర్థమయినట్లు కనిపించడం లేదు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు గ్రౌండ్ రియాలిటీ పై ఇంకా అర్థమయినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన తన ఓటమిని సీరియస్ గా తీసుకోవడం లేదు. తనకు 40 శాతం ఓట్లు వచ్చాయని ధీమాగా ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజులు ముందు పార్టీని యాక్టివ్ చేస్తే సరిపోతుందని ఆయన భావిస్తున్నట్లుంది. అందుకే పెద్దగా వైసీపీలో జరుగుతున్నపరిణామాలను ఆయన సీరియస్ గా తీసుకోవడం లేదు. అందివచ్చే ప్రతి అవకాశాన్ని మలచుకునే ప్రయత్నమూ చేయడం లేదు. టైమ్ అదే కలసి వస్తుందిలే అని గట్టిగా జగన్ భావిస్తున్నట్లుంది. అందుకే పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో కూడా వ్యక్తమవుతుంది.
ఏడు నెలల కాలంలో...
గత ఎన్నికల్లో తన నుంచి వెళ్లిపోయిన వర్గాలను తిరిగి చేర్చుకునే ప్రయత్నం ఈ ఏడు నెలల్లో జగన్ చేసినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన నాలుగు గోడల మధ్య మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని చెప్పి ఆత్మానందం పొందుతున్నారు తప్పించి అంతకు మించిన మానవ ప్రయత్నం ఏదీ చేయడం లేదని పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులంటూ నినదించిన జగన్ మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తానని ప్రకటించారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇటు ఉత్తరాంధ్రలో గాని, అటు రాయలసీమలో గాని ఆయన పర్యటించింది లేదు. ప్రధానంగా రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఇంత వరకూ ఏడు నెలల కాలంలో పర్యటించలేదు.
అటు వైపు చూడకుండా...
ఇక ఉత్తరాంధ్ర జిల్లాల వైపు కూడా ఆయన చూడలేదు. ఇలాగయితే ఎలా అని అనేక మంది వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నా వస్తున్నా అంటూ కాలయాపన చేస్తూ టైం గడిపేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి అనేక మంది నేతలు పార్టీని వీడి వెళ్లారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతాలకు తాను ఏంచేసిందీ చెప్పే ప్రయత్నం చేయలేకపోతే ఇక నేతల్లోనైనా ఎలా విశ్వాసం ఉంటుందని భావిస్తున్నారు. నేతలు కూడా డల్ గానే ఉన్నారు. ఉదాహరణకు ముద్రగడ పద్మనాభం వంటి నేతల ఇంటిపై దాడికి ప్రయత్నం జరిగితే కనీసం అక్కడకు వెళ్లి పలకరించే ప్రయత్నం కూడా జగన్ చేయకపోవడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఫోన్ లోనే పలకరించడాన్ని కూడా తప్పు పడుతున్నారు.
లోపం ఎక్కడన్నది?
గతంలో మాదిరిగానే ఉంటే ఓటర్లు తమ వద్దకు నడుచుకుని రావడం కలలో కూడా జరగదని చెబుతున్నారు. అయినా జగన్ మాత్రం వెయిట్ చేస్తున్నారు. ఎందుకో తెలియదు కానీ. అధికారంలోకి వస్తే తన కారణంగానేనని చెప్పుకునే వైసీపీ చీఫ్ ఓటమికి మాత్రం వేర్వేరు కారణాలు వెతుక్కోవడం కూడా లీడర్లకు నచ్చడం లేదు. జగన్ లోనే లోపం ఉందన్నది అందరికీ తెలిసిందే. రాజకీయ వ్యూహాలు గ్రౌండ్ చేయడంలో తేడా కొట్టిందనీ తెలుసు. కేవలం అభ్యర్థులను మార్చినంత మాత్రాన జనం ఆదరించరనీ తెలిసి వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేయాలన్నది మాత్రం వైసీపీ నేత వద్ద ఒక రూట్ మ్యాప్ లేకుండా పోయిందన్న కామెంట్స్ వైసీపీలో బలంగా వినిపిస్తున్నాయి. మరి జగన్ ఇప్పటికైనా యాక్టివ్ అవుతారా? లేదా? అన్నది చూడాలి.
Next Story