Sat Dec 06 2025 07:48:29 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : పవన్ ను సైడ్ చేసేందుకు జగన్ స్ట్రాటజీ మార్చినట్లుందిగా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈసారి కొంత స్ట్రాటజీ మార్చినట్లు కనపడుతుంది

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈసారి కొంత స్ట్రాటజీ మార్చినట్లు కనపడుతుంది. గతంలో మాదిరిగా కేవలం ఒక సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తారన్న భావన నుంచి పార్టీ నేతలను బయట పడేయాలని ఆయన గట్టిగా భావిస్తున్నట్లున్నారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజికవర్గం నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇన్ ఛార్జులుగా వారినే నియమించే వారు. అంతేకాదు.. మూడు ప్రాంతాల రీజనల్ ఇన్ ఛార్జులు కూడా రెడ్డి సామాజికవర్గం నేతలే. పదవుల్లో నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ అని నినాదం చేస్తున్నా ముఖ్యమైన పదవుల్లో ఎక్కువగా రెడ్డి సామాజికవర్గం నేతలకే ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. గత ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు కూడా దూరమయిందన్న భావనలో ఉన్నారు. అత్యధిక ఓటర్లున్న కాపులను ఆకట్టుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
ఓటమి తర్వాత నిర్ణయాల్లో...
అందుకే ఈసారి ఓటమి తర్వాత ఆయనలో కొంత మార్పు కనిపిస్తున్నట్లుంది. తొలుత శాసనమండలిలో పార్టీ పక్ష నేతగా బొత్స సత్యనారాయణను నియమించి కాపులకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఒకింత మార్పు వచ్చిందని అంటున్నారు. ఇక కీలకమైన పదవుల్లో కూడా కాపులను నియమిస్తున్నారు. గతంలో ఉత్తారంధ్రకు ఇన్ ఛార్జిగా విజయసాయిరెడ్డి, వైవీసుబ్బారెడ్డిలను నియమించిన జగన్ ఈసారి మాత్రం కాపు సామాజికవర్గానికి చెందిన కన్నబాబుకు ఆ పదవి ఇవ్వడం కూడా స్ట్రాటజీ మార్చడంలో భాగమేనని అంటున్నారు. కాపులు అంటే పవన్ కల్యాణ్ అనే ముద్ర ఉంది. దాని నుంచి బయటపడేయడానికి జగన్ ఈ రకమైన నిర్ణయాలను తీసుకుంటున్నట్లు కనపడుతుంది.
వంగవీటి కుటుంబానికి...
పవన్ పై కాపుల్లో ఇప్పుడే వ్యతిరేకత మొదలయిందని, తమ సామాజికవర్గానికి చెందిన నేతగా పవన్ ను అక్కున చేర్చుకున్నా తమకు ఏ రకంగా ఉపయోగపడకపోవడం కొంత వారు అసహనంగా ఫీలవుతున్నారు. మరీ ముఖ్యంగా కాపులకు బ్రాండ్ అంబాసిడర్ అయిన వంగవీటి కుటుంబానికి రాజకీయంగా అన్యాయం జరిగిందని ఎక్కువ మంది భావిస్తున్నారు. వంగవీటి రాధా అంత కష్టపడినా కనీసం ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవి ఇవ్వలేదన్న భావనతో కాపు సామాజికవర్గంలో ఒకింత అసంతృప్తి ఉంది. ఇది వచ్చే కాలం మరింత పెద్దది కానుంది. కాపులంటే పవన్ వెంట నడిచే వారు మాత్రమే కాదని, కాపు సంఘాల నేతలు కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది.
తూర్పు గోదావరి జిల్లాలోని కాపుల్లో...
ఇక తూర్పు గోదావరి జిల్లాలోని కాపుల్లో ఒకరకమైన అభద్రతాభావం మొదలయింది. కూటమి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు. టీడీపీలో ఉండే కాపు సామాజికవర్గం నేతలే బాహాటంగా విమర్శలకు దిగుతున్నారు. కాపు రిజర్వేషన్లతో పాటు కాపులకు ఇచ్చే పథకాలు కూడా అమలు కావడం లేదన్న అభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో హరిరామ జోగయ్య సయితం కూటమి ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టారు. కేవలం అమరావతికి మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. అందుకే జగన్ కాపులకు ఇకపై ఏ పదవి ఇచ్చినా ప్రాథాన్యత దక్కేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటున్నారు.
Next Story

