Tue Jul 08 2025 18:38:21 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : వైఎస్ జగన్ ఫిక్స్ అయినట్లేనా? అందుకే తొందరపడుతున్నారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మానసికంగా సిద్ధమయినట్లు కనిపిస్తుంది. తనను జైలుకు పంపడానికి కూటమి ప్రభుత్వం రెడీ అవుతుందని భావిస్తున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మానసికంగా సిద్ధమయినట్లు కనిపిస్తుంది. తనను జైలుకు పంపడానికి కూటమి ప్రభుత్వం రెడీ అవుతుందని భావిస్తున్నారు. అందుకోసమే ఐదు వారాల పాటు ఉద్యమ కార్యాచరణను ప్లాన్ చేశారు. నేతలను నియోజకవర్గాలలో యాక్టివ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇకపై తన పర్యటనలపై కూడా ఆంక్షలు ఖచ్చితంగా ఉంటాయని భావించిన జగన్ నియోజకవర్గాల్లోనే జనం వద్దకు నేతలను పంపి వారిని నాలుగేళ్ల ముందే ఎన్నికలకు సిద్ధం చేయాలని రెడీ అవుతున్నారు. అయితే నాలుగేళ్ల ముందు నుంచి నేతలు ఏ మేరకు గ్రౌండ్ లెవెల్ లోకి కాలు మోపుతారన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. జగన్ వస్తే తప్ప నేతలు కదలని పరిస్థితులున్నాయి.
కేసులు వరసగా...
ఒకవైపు మద్యం కేసు, మరొక వైపు సింగయ్య మృతి కేసు ఇలా వరస కేసులు జగన్ ను చుట్టుముట్టేలా కనపడుతున్నాయి. మద్యం కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం మోహిత్ రెడ్డిని విచారించనుంది. ఆ తర్వాత మిధున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. చివారఖరుగా జగన్ వైపు సిట్ చూసే అవకాశముందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మరొక వైపు ఇదే కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకుని మద్యం కుంభకోణం ద్వారా అందిన నిధులను మనీలాండరింగ్ చేసినట్లు కూడా ఈడీ తన కోణంలో దర్యాప్తు చేస్తుంది. మద్యం కుంభకోణంలో వచ్చిన నగదును కొంత భాగం మొన్నటి ఎన్నికలకు వినియోగించారని సిట్ దర్యాప్తులో వెల్లడయింది.
చీఫ్ ను అరెస్ట్ చేస్తేనే?
నేతలను అరెస్ట్ చేసినంత మాత్రాన పార్టీ బలహీనం కాదు. అదే పార్టీ అధినేత ను కేసుల్లో ఇరికిస్తే నేతల నుంచి క్యాడర్ వరకూ భయపడే అవకాశముందని భావించి త్వరలోనే జగన్ అరెస్ట్ జరగవచ్చన్న ప్రచారం ఏపీ వ్యాప్తంగా చర్చజరుగుతుంది. దీంతో పాటు జగన్ కూడా అరెస్ట్ కావడానికి మానసికంగా సిద్ధంగానే ఉన్నారు. అందుకే ప్రతి సమావేశంలో అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తే మూడు నాలుగు నెలల తర్వాత బెయిల్ పై బయటకు వస్తామని, భయపడేది లేదని చెబుతుండటం ఇందుకు అద్దం పడుతుంది. అందుకే జగన్ కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంలో చంద్రబాబు సర్కార్ పై నేరుగా ప్రత్యక్ష్య యుద్ధానికి సిద్ధమయ్యారని కనపడుతుంది.
వరస కార్యక్రమాలతో...
దాదాపు నలభై రోజుల పాటు సాగే రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫేస్టో తర్వాత మరొక కార్యక్రమంతో జనం ముందుకు వెళ్లాలని జగన్ టీం ప్లాన్ చేసుకున్నట్లు కనపడుతుంది. అందుకోసం వరసగా ఇప్పటికే వివిధ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ వారికి మద్దతుగా ఒకదాని వెంట మరొకటి కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు కనపడుతుంది. ఇప్పటికే జగన్ టీం దీనికిసంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఒకవేళ తాను జైలుకు వెళ్లినా నేతలు ఆ కార్యక్రమాలను అమలు చేసేలా ప్లాన్ చే్యాలని ముఖ్య నేతలకు జగన్ ఇప్పటికే సూచించినట్లు తెలిసింది. ఏడాది ముందు నుంచే పదకొండు సీట్లు వచ్చినా క్యాడర్ లో నీరసం ఆవరించకుండా వివిధ పర్యటనలు చేస్తున్న జగన్ పార్టీకి ఊపు తేవడమే కాకుండా ప్రాణం పోయడానికి మరి తాజా కార్యక్రమాలు ఏ మేరకు పనిచేస్తాయన్నది వేచి చూడాలి.
Next Story