Fri Dec 05 2025 21:45:21 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : సేమ్ ఫార్ములా వర్క్ అవుట్ అవుతుందా? అందుకే జిల్లాల పర్యటన అట
వైసీపీ అధినేత జగన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తాను పర్యటించిన తర్వాత పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని జగన్ భావిస్తున్నారని తెలిసింది

వైసీపీ అధినేత జగన్ మరొకసారి పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. అందుకోసమే ట్రయల్ గా ఇప్పుడు జిల్లాలను పర్యటిస్తున్నారట. ప్రజల్లో తనకు ఉన్న ఇమేజ్ తగ్గిందా? లేదా? అన్న అంచనాలను వేసుకోవడానికే జగన్ ఈ రకమైన పర్యటనలు చేపట్టినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అన్ని ప్రాంతాల్లో తాను పర్యటించిన తర్వాత పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని జగన్ భావిస్తున్నారని తెలిసింది. 2019 ఎన్నికలకు ముందు చేపట్టిన యాత్ర సక్సెస్ అయి అధికారం దక్కడంతో ఈసారి కూడా అదే ఫార్ములాతో వెళ్లాలన్నది జగన్ అభిప్రాయంగా ఉంది. అయితే ఏ సమయంలో పాదయత్ర నిర్వహిచాలన్నది ఇంకా నిర్ణయించకపోయినా 2027 లో యాత్రకు శ్రీకారం చుట్టే అవకాశముందని సీనియర్ నేతలు ఒకరు తెలిపారు.
మరోసారి కాళ్లకు పనిచెప్పి...
వైఎస్ జగన్ మళ్లీ పాదయాత్రతో జనంలోకి వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. రాయలసీమలో తన గ్రాఫ్ పెరిగిందని జగన్ భావిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరికి వెళ్లినప్పుడు చివరకు తాను ప్రయాణించే హెలికాప్టర్ కూడా ధ్వంసమయింది. అలాగే తిరుపతిలో తొక్కిసలాట జరిగి మరణించినప్పుడు పార్టీ కార్యకర్తలు విపరీతంగా వచ్చారు. ఇక కడప తన సొంత జిల్లా కావడంతో ఈసారి తనకు ప్రజలు అండగా నిలబడతారని భావిస్తున్నారు. కర్నూలు జిల్లాకు వెళ్లినప్పుడు నంద్యాల ప్రాంతంలో కూడా జనం పోటెత్తారు. దీంతో రాయలసీమలో ఇక తనకు ఇబ్బంది లేదని, తిరిగి తన ఇమేజ్ బిల్డప్ అయిందని జగన్ పూర్తిగా విశ్వసిస్తున్నారు. తన పాలనకు, ప్రస్తుతకూటమి పాలనకు బేరీజు వేసుకున్న ప్రజలు క్రమంగా తనవైపునకు సీమలో తిరుగుతున్నారని భావిస్తున్నారు.
పొదిలి, పల్నాడు పర్యటనలు సక్సెస్ కావడంతో
ఇక ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో అనూహ్య స్పందన లభించింది. చివరకు పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ కూడా జరిగింది. జనం హెలికాప్టర్ ల్యాండ్ అయిన దగ్గరనుంచితిరిగి టేకాఫ్ అయ్యేంత వరకూ తన వెంటే ఉండటంతో ఆ జిల్లాపై కూడా భరోసా వచ్చింది. తెనాలి పర్యటనకు వెళ్లినప్పుడు కూడా నం పోటెత్తారు. తాజాగా పల్నాడు జిల్లాలో పర్యటన కూడా ఫుల్లు సక్సెస్ అయిందని వైసీపీ వర్గాలే కాదు అందరూ ఒప్పుకుంటున్నారు. రెంటపాళ్ల గ్రామానికి చేరుకోవాలంటే ఆరు గంటల సమయం పట్టిందంటే అడుగడుగునా జగన్ ను కార్యకర్తలు ఎలా కాళ్లకు అడ్డంపడ్డారన్నది అర్థం అవుతుంది. రాజధాని అమరావతి పక్కన ఉన్న గుంటూరు జిల్లాలో తన పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇక జగన్ ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది.
బలహీనంగా ఉన్న...
శ్రీకాకుళం, విశాఖపట్నంలో పార్టీ బలహీనంగా ఉందని జగన్ వివిధ నివేదికల ద్వారా తెప్పించుకుని దానిని సెట్ రైట్ చేసి అక్కడ బలమైన నాయకత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత ఆ జిల్లాలకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారని తెలిసింది. ఇక గెలుపునకు ఖచ్చితంగా అత్యధిక స్థానాలు సాధించాల్సిన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల్లో కూడా జగన్ వివిధ దశల్లో పర్యటించిన తర్వాత పాదయాత్ర మొదలు పెట్టాలన్న యోచనలో ఉన్నారు. పాదయాత్ర ద్వారా అయితేనే తాను ప్రజల్లోకి సులువుగా వెళ్లగలనని, వారిని కలుసుకోవడంతో పాటు నేరుగా కనెక్ట్ అయి వారితో ఇంటరాక్ట్ అయితే వచ్చే ఫలితం అనుకూలంగా వస్తుందని జగన్ అంచనా వేస్తున్నారు.
ఎక్కడెక్కడ లోపాలున్నదీ...
దీంతో పాటు పార్టీలో ఎక్కడెక్కడ ఏ రకమైన లోపాలున్నాయన్నది కూడా గుర్తించేందుకు పాదయాత్ర ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు. అయితే ప్రభుత్వంపై ఇంకా బాగా వ్యతిరేకత పెరిగిన తర్వాత మాత్రమే పాదయాత్ర చేపడితే మంచి ఊపు లభిస్తుందని ఆయన భావిస్తున్నారు. అందుకోసమే ముందుగా అన్ని జిల్లాల్లో పర్యటనలు చేసిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని 2027లో పాదయాత్ర మొదలుపెట్టి ఎన్నికల నాటికి పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఈసారి కూడా గతంలో మాదిరిగా తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాతనే పాదయాత్ర ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారు. పాదయాత్ర రోడ్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదు కానీ బహుశ ఈసారి ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకూ జగన్ పాదయాత్ర చేస్తారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మరి పాదయాత్ర మరోసారి అధికారాన్ని తెచ్చిపెడుతుందా? లేదా? అన్నది మాత్రంచూడాల్సి ఉంది.
Next Story

