Fri Dec 05 2025 11:39:42 GMT+0000 (Coordinated Universal Time)
సీనియర్లతో జగన్ కీలక వ్యాఖ్యలు.. ఇలా వెళ్లకపోతే?
తాడేపల్లిలో సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు

తాడేపల్లిలో సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేతలతో సమావేశమైన జగన్ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాలపై చర్చించారు. పలు అంశాలపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు మోసాలను మరింత ఎండగట్టాలని నేతలను కోరారు. వాటిని ఇంకా లోతుగా ప్రజలకు వివరించాలని తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీరని నష్టమన్న జగన్, పేదల పట్ల చంద్రబాబు కక్షను బట్టబయలు చేయాలని నేతలకు తెలిపారు. ఏవేవో సాకులు చెబుతూ అవి ప్రజలు నమ్మేలా ప్రచారం చేయడంపై నిలదీయాలని అన్నారు.
ప్రజల్లోకి వెళుతూ...
సంపద సృష్టించడం తనకు తెలుసంటూ ప్రచారం చేసుకున్న చంద్రబాబు కేవలం అప్పులతోనే కాలం వెళ్లదీస్తున్నారని, చంద్రబాబు దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకోసం రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని జగన్ తెలిపారు. చంద్రబాబు తమకు కొత్తగా మెడికల్ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడం అత్యంత దారుణమన్న జగన్ కేంద్రం వచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్ సీట్లను అదనంగా పెంచబోతున్న విషయాన్ని కూడా తెలియజేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల కోత, నిలిచిపోయిన పథకాలపై ప్రజల్లో చైతన్యం తేవాలని, అలాగే ఆరోగ్యశ్రీ ఆగిపోవడంపైన జనంలోకి తీసుకెళ్లాలని తెలిపారు. తొమ్మిది నెలల కూటమి పాలన.. పేదల వ్యతిరేక పాలనలా మారిందన్న జగన్ పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Next Story

