Fri Dec 05 2025 11:13:20 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ మానసికంగా రెడీ అయిపోయారా? అందుకే ప్రిపేర్ చేస్తున్నారా?
వైసీపీ అధినేత జగన్ ముందుగా నేతలను ప్రిపేర్ చేస్తున్నారు. మానసికంగా సిద్ధం చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది

వైసీపీ అధినేత జగన్ ముందుగా నేతలను ప్రిపేర్ చేస్తున్నారు. మానసికంగా సిద్ధం చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ నాలుగేళ్లు మరింత జటిలమైన సమస్యలను ఎదుర్కొనబోతున్నామని పార్టీ నేతలకు చెప్పనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నమోదవుతున్న కేసులు, తాజా పరిణామాలపై జిల్లా పార్టీ అధ్యక్షులతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలపై వరస కేసులు నమోదవుతున్నాయి. కొందరు అధికారులు కూడా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటి వరకూ ఒకరమైన నేతలను లక్ష్యంగా చేసుకున్న వారు రానున్న కాలంలో కీలక నేతలను కూడా టార్గెట్ చేసే అవకాశముందని చెప్పనున్నారు.
మెడపై వేలాడుతూ...
అందులో జగన్ కూడా ఉంటారు. ఒకవైపు మద్యం కేసు మెడపై వేలాడుతుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అనేక అరెస్ట్ లు జరిగాయి. ఇందులో పకడ్బందీగా ఆధారాలు లభించాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు. మద్యం స్కామ్ కేసులో పెద్దయెత్తున డబ్బులు చేతులు మారాయని, విదేశాలకు కూడా వెళ్లాయని ప్రభుత్వం భావిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన చేతికి మట్టి అంటకుండా జగన్ ను లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు పెద్దయెత్తున ప్రచారం జరగుతుంది. లిక్కర్ స్కామ్ కేసులో లభించిన ఆధారాలతో సీబీఐకి కాని, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కానీ ఇస్తే కేంద్రప్రభుత్వ సంస్థలే జగన్ ను అరెస్ట్ చేస్తారని, అప్పుడు తమ ప్రభుత్వంపై ఎలాంటి ఇబ్బందులు రావని, జగన్ కు కూడా రాష్ట్రంలో సానుభూతి లభించే అవకాశం లేదన్న లెక్కలు వేసుకుంటున్నారు.
మద్యం కేసు కీలకం...
అందుకే మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారనుంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్లాయంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేతనే గేమ్ మొదలు పెట్టాలన్న యోచనలో ఏపీ లోని అధికార పార్టీలున్నట్లు సమాచారం. అందుకే జగన్ జోలికి తాము వెళ్లకుండా, కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఈ కేసులో నిజాల నిగ్గుతేల్చి కేసు ను డీల్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ కు కూడా ఈ విషయం అర్థమయినట్లే ఉంది. అందుకే మానసికంగా సిద్ధమయ్యారు. తాను కేసుల్లో జైలుకు వెళ్లినా పార్టీని నడపటం కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు.
అందుకే వరస సమావేశాలు...
త్వరలోనే జగన్ అరెస్ట్ అవుతారన్న సమాచారం రావడంతోనే వరస సమావేశాలతో నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు సహకారం అందుతుందన్నది చూడాల్సి ఉంది. మోదీ, అమిత్ షాలకు ఇప్పటికీ జగన్ అంటే కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ అదే సమయంలో చంద్రబాబు అవసరం కూడా అంతే ఉంది. ఈ సమయంలో రాజకీయ అవసరాలు, వ్యక్తిగత అభిప్రాయాలను డామినేట్ చేస్తాయని అంటున్నారు. మొత్తం మీద తనతో పాటు ముఖ్యనేతలు కూడా త్వరలోనే అరెస్ట్ కాక తప్పదని జగన్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన నేతలను కూడా ముందుగానే మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారని పార్టీ సీనియర్ నేతలే అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?
Next Story

