Sun Jul 20 2025 07:21:31 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నాలుగేళ్ల ముందే జగన్ రెడీ అయిపోతున్నారా? వారందరికీ ఓకే చెప్పేశారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముందుగానే టిక్కెట్లు ఖరారు చేసే పనిలో ఉన్నారని తెలిసింది.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముందుగానే టిక్కెట్లు ఖరారు చేసే పనిలో ఉన్నారని తెలిసింది. ముందుగా నియోజకవర్గాలకు టిక్కెట్లు ఖరారు చేస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని భావిస్తున్నారు. నియోజకవర్గాల ఇన్ ఛార్జులుగా ఉన్న వారు ఇప్పటి నుంచే పనిచేసి జనంలోకి వెళ్లగలిగితే కొంత వరకూ అడ్వాంటేజీ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే 175 నియోజకవర్గాల్లో దాదాపు వంద నియోజకవర్గాలకు అభ్యర్థులను నాలుగేళ్ల ముందు ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రత్యర్థి ఎవరన్నది సంబంధం లేకుండా వారు పార్టీ కోసం పనిచేసుకు వెళ్లాలంటే వారికి నాలుగేళ్ల కాలం పడుతుందని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ముందే ఎన్నికలు వస్తాయని...
ముఖ్యంగా జమిలి ఎన్నికలు సాధారణ ఎన్నికలకు ఏడాది ముందే వస్తాయని భావిస్తున్నారు. అంటే 2027 ఎండింగ్ లో కాని, 2028లో కానీ ఎన్నికలు జరిగే అవకాశముందని భావించి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. పార్టీలో గతంలో వారసులకు టిక్కెట్లు ఇచ్చి తప్పిదం చేశామని, ఈసారి అలా కాకుండా సీనియర్ నేతలకు మాత్రమే తిరిగి పోటీ చేయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుంది. వారసులను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ మేరకు కొందరికి ఇప్పటికే జగన్ సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో మీరు పనిచేసుకుంటూ వెళ్లమని చెప్పినట్లు తెలిసింది. ఉదాహరణకు అంబటి రాంబాబుకు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవి ఇవ్వడం కూడా అందులో భాగమేనంటున్నారు.
పాత నియోజకవర్గాలకే...
సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మరెవరినైనా పోటీ చేయించాలని భావిస్తున్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో నియోజకవర్గాలను మార్చిన వారికి కూడా సొంత నియోజకవర్గాలను కేటాయించాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే వాటిని మాత్రం కేటాయించరట. ఉదాహరణకు గత ఎన్నికల్లో యర్రగొండపాలెం నుంచి ఆదిమూలం సురేష్ ను కొండపికి పంపారు. అయితే అక్కడ వైసీపీ గెలవడంతో సురేష్ ను తిరిగి సంతనూతలపాడు నియోజకవర్గానికి పంపాలని నిర్ణయించారు. మిగిలిన వారంతా వారి సొంత నియోజకవర్గాలకు వెళ్లిపోయేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది.
వివిధ కేసుల్లో ఉన్న వారు...
మరొక వైపు వివిధ కేసుల్లో అక్రమంగా అరెస్టయిన వారికి టిక్కెట్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, మచిలీపట్నం నుంచి పేర్నినాని, గుడివాడ నుంచి కొడాలి నాని, దెందులూరు నుంచి అబ్బయ్య చౌదరి, తాడికొండ నుంచి నందిగం సురేష్, సర్వేపల్లి నుంచి కాకాణి గోవర్థన్ రెడ్డి, మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేట నుంచి విడదల రజని, తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి, రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వంటి వారి పేర్లకు ఇప్పటికే ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అక్రమ కేసుల్లో అరెస్టయిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం మీద నాలుగేళ్ల ముందే జగన్ టిక్కెట్లపై ఫోకస్ పెట్టడంతో ఇక ఫ్యాన్ పార్టీలో కొంత సందడి మొదలయిందంటున్నారు.
Next Story