Fri Dec 05 2025 22:46:33 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : అమరావతికి జగన్ దూరం.. దూరం.. అందుకేనటగా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం ఎంత వరకూ కరెక్ట్ అన్న ప్రశ్న తలెత్తుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తుంటే ప్రధాని మోదీని కలిసే అవకాశాన్ని జగన్ తనంతట తానే వదులుకున్నారని కొందరు అంటున్నారు. అదే సమయంలో దూరంగా ఉండటమే మేలన్న అభిప్రాయమూ వ్యక్తమవుతుంది. రాజధాని అమరావతి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ప్రధాని మోదీ వస్తున్నారు. అమరావతి పునర్నిర్మారణ పనుల ప్రారంభం కోసం ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు సాయంత్రం ఆయన అమరావతికి చేరుకుని కేవలం గంట నుంచి రెండు గంటలు మాత్రమే ఉంటారు.
నేటి వరకూ ఇక్కడే ఉండి...
అయితే ఈరోజు సాయంత్రం వరకూ జగన్ తాడేపల్లిలోని తన ఇంట్లోనే ఉన్న జగన్ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళుతుండటంతో ఆయన ప్రధానిమోదీ పర్యటనకు హాజరు కూకడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది. ప్రొటోకాల్ అధికారులు జగన్ కు ప్రధాని మోదీ సభకు రావాలని ఆహ్వాన పత్రికను అందించడానికి తాడేపల్లి ఇంటికి వెళ్లినా జగన్ అందుబాటులో లేరని చెప్పడంతో దానిని ఆయన పీఏకు ఇచ్చి వచ్చారు. . సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి ఎనిమిది గంటలకు బెంగళూరుకుచేరుకోనున్నారు. అంటే రేపటి ప్రధాని సభకు జగన్ దూరంగా ఉంటారని డిసైడ్ అయినట్లయింది. జగన్ ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండటానికి అనేక కారణాలున్నాయి.
వ్యతిరేకించిన చోట...
మామూలుగా పర్యటనకు వస్తే హాజరయినా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ తాను వ్యతిరేకించిన చోట అదే.. రాజధాని నిర్మాణాన్ని ఐదేళ్ల పాటు పక్కన పెట్టి, మూడు రాజధానులంటూ నినాదాన్ని అందుకున్న తాను ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి జగన్ వచ్చి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోదీ కోసం వెళ్లి అవమానాల పాలు కావాల్సి వస్తుందేమోనన్న భయం కూడా జగన్ లో ఉంది. అందులోనూ తనకు నచ్చని, మెచ్చని అమరావతి పనులను ప్రారంభించే పనులకు హాజరైతే భవిష్యత్ లో రాజధాని విషయంలో అధికార పార్టీపై విమర్శలు చేయడానికి కుదరదన్న భావనతోనే జగన్ దూరంగా ఉన్నారని అంటున్నారు.
వెళ్లినా.. వెళ్లకపోయినా...?
జగన్ గా తాను వెళ్లినా.. వెళ్లకపోయినా అక్కడ పట్టించుకునే వారు పెద్దగా ఉండరు. అదే సమయంలో తాను హాజరయితే గత ఐదేళ్లు తాను చెప్పిన దానికి విలువ లేకుండా పోతుంది. మూడు రాజధానులంటూ వచ్చి అమరావతి పనుల నిర్మాణానికి ఎలా వచ్చారంటూ భవిష్యత్ లో జగన్ ను ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే జగన్ ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి దూరంగా ఉండటమే మేలు అని నిర్ణయించుకుని ఒకరోజు ముందుగానే బెంగళూరుకు బయలుదేరి వెళుతున్నారు. రానున్న కాలంలో అమరావతి లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తనకు సంబంధం లేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయడానికి అవకాశం దొరుకుతుందని కూడా అంచనా వేసుకుని ఆయన విమానమెక్కి వెళ్లిపోతున్నారట.
Next Story

