Fri Dec 05 2025 08:14:10 GMT+0000 (Coordinated Universal Time)
రైలులో ఒంటరి మహిళపై అఘాయిత్యం.. గుంటూరు జిల్లాలో ఘటన
రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న 35ఏళ్ల మహిళపై ఓ గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది

రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న 35ఏళ్ల మహిళపై ఓ గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. దుండగుడు ఆమె నుంచి నగదు, మొబైల్ దోచుకెళ్లిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన గుంటూరు–పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ల మధ్య వస్తున్న సంత్రాగాచి స్పెషల్ ఎక్స్ప్రెస్లో జరిగిందని బాధితురాలు పోలీసులకు తెలిపారు. రాజమండ్రికి చెందిన బాధితురాలు ఉద్యోగ నిమిత్తం చర్లపల్లికి వెళ్తూ, రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఈ రైలెక్కింది. రాత్రి 8 గంటల సమయంలో గుంటూరులో రైలు ఆగినప్పుడు సుమారు 40ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి మహిళా బోగీలోకి ఎక్కాడు.
మొబైల్, నగదు దోచుకుని...
ఆ వ్యక్తిని వెళ్లిపోవాలని ఆమె హెచ్చరించినా పట్టించుకోలేదని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. రైలు మళ్లీ ప్రయాణం మొదలైన తర్వాత అతడు కత్తితో బెదిరించి మహిళపై అత్యాచారం చేశాడని, అనంతరం ఆమె వద్ద ఉన్న రూ.5,600 నగదు, మొబైల్ ఫోన్ లాక్కొని పెద్దకూరపాడు దగ్గర కదిలే రైలునుంచి దూకి పారిపోయాడని పోలీసులు తెలిపారు. చర్లపల్లి చేరుకున్న బాధితురాలు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనంగా, సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పరిధి కారణంగా కేసును ఆంధ్రప్రదేశ్లోని నడికుడి పోలీసులకు బదిలీ చేశారు. బాధితురాలి వర్ణన ఆధారంగా నిందితుడి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Next Story

