Fri Dec 05 2025 18:21:08 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ పార్టీకి మంచి రోజులేనా? పర్యటనలు సక్సెస్ అవుతుండటమే కారణమా?
వైసీపీ అధినేత జగన్ ఎక్కడకు పర్యటనకు వెళ్లినా విపరీతంగా జనం వస్తున్నారు.

వైసీపీ అధినేత జగన్ ఎక్కడకు పర్యటనకు వెళ్లినా విపరీతంగా జనం వస్తున్నారు. వాళ్లు కార్యకర్తలు కావచ్చు. అభిమానులు కావచ్చు. కూటమి ప్రభుత్వంపై విసుగు చెందని వారు కావచ్చు. ఎవరైనా సరే జగన్ పర్యటనలో జనం మాత్రం విపరీతంగా వస్తుండటంతో పార్టీ నేతల్లో ఉత్సాహం పెరుగుతుంది. జగన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జరిపిన పర్యటనలన్నీ విజయవంతమయ్యాయి. ప్రాంతాలకు అతీతంగా సక్సెస్ కావడంతో వైసీపీ నేతల్లో తిరిగి ఉత్సాహం ఉరకలేస్తుంది. జగన్ ఏడాది కాలం నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర లోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు రాయలసీమలోనూ, విశాఖ, శ్రీకాకుళం ఉత్తరాంధ్రలోనూ, తెనాలి, పొదిలి కోస్తాంధ్ర జిల్లాల్లో పర్యటించారు.
జనం పోట్తెత్తుతుండటంతో...
ఇప్పటి వరకూ జగన్ పర్యటించిన అన్ని ప్రాంతాలకు జనం పోటెత్తారు. జనసమీకరణ చేయడానికి పార్టీ ప్రతిపక్షంలో ఉంది. వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలనుకునే వారు చేసే బలప్రదర్శన కాదు. చాలా వరకూ జగన్ కోసం వచ్చినవారేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. వాహనాలను సమకూర్చకుండానే, ఎలాంటి సదుపాయాలు కల్పించకుండానే జనం తరలి రావడం చూసి నేతల్లో ఒకరమైన విజయదరహాసం కనపడుతుంది. ప్రజల్లో వచ్చిన మార్పునకు సంకేతమని సీనియర్ వైసీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. జగన్ వస్తున్నారని తెలిసి తాము ఆహ్వానించకుండానే పత్రికలు, టీవీల్లో వార్తలు చూసి వచ్చిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారని ఆయన అనడం తాము విజయానికి చేరువలో ఉన్నామని చెప్పకనే చెప్పారు.
పార్టీని వీడదామనుకున్న వారు...
వైసీపీ అధినేత జగన్ పర్యటనకు స్పందన మామూలుగా లేకపోవడంతో ఇక నేతలు కూడా పార్టీని వీడే ఆలోచన మానుకున్నట్లే కనపడుతుంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి వైసీపీదే అధికారం అని మానసికంగా వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. ప్రధానంగా గుంటూరు జిల్లాలో ఉన్న తెనాలిలోనూ జనం అంత మేర వచ్చారంటే ఇక చెప్పాల్సిన పనిలేదంటున్నారు. ఇక పొదిలిలో పొగాకు రైతుల పరామర్శకు వెళ్లినప్పుడు జగన్ హెలికాప్టర్ దిగిన దగ్గర నుంచి యువకులు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు హాజరవ్వడంతో ఇక తమకు తిరుగులేదన్న అభిప్రాయంలోకి జగన్ పార్టీ నేతలు వచ్చారు. ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమదే విజయం అన్న ధీమా ఫ్యాన్ పార్టీ నేతల్లో పెరిగింది.
నాడు చంద్రబాబు సభలకూ...
2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనేక కార్యక్రమాలు పెట్టారు. అనేక నినాదాలతో కార్యక్రమాలను పెట్టి జనం ముందుకు వెళ్లారు. ఒంగోలు నాడు పెట్టిన మహానాడు సూపర్ సక్సెస్ అయింది. అప్పుడే టీడీపీ విజయం ఖాయమయిందని క్యాడర్ లో విశ్వాసం కనిపించింది. కందుకూరు, గుంటూరు వంటి సభల్లో తొక్కిసలాట జరిగి మరణించినా ఎవరూ వెనక్కు తగ్గలేదు. అదే విశ్వాసం ఇప్పుడు వైసీపీ క్యాడర్ లోనూ కనిపిస్తుంది. వైసీపీ సోషల్ మీడియా కూడా రెండు మూడు నెలల కంటే ముందు ఇప్పుడు యాక్టివ్ గా మారింది. జనం రాక చూసిన వైసీపీ నేతలు తమను అరెస్ట్ చేసుకోండి అని సవాళ్లు విసరడం కూడా అధికారంలోకి రావడం గ్యారంటీ అని భావించడం వల్లనేనని అంటున్నారు. మొత్తం మీద ఎన్నికలకు నాలుగేళ్ల ముందే వైసీపీ లో మంచి జోష్ కనిపిస్తుండటం ఆ పార్టీ నేతలను యాక్టివ్ చేసిందనే చెప్పాలి.
Next Story

