Sun Jun 22 2025 12:19:04 GMT+0000 (Coordinated Universal Time)
Junior Ntr : జూనియర్ రాజకీయాల్లోకి వస్తారా? రమ్మంటే రావడానికి ఇది సమయమా?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ అంశం తెరపైకి వస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ అంశం తెరపైకి వస్తుంది. తాజాగా కేకే సర్వే సంస్థలో కూడా ఎక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు తేలింది. పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతు లభిస్తుందని, అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని తమ సర్వేలో తేలినట్లు కేకే సంస్థకు చెందిన సర్వే తెలిపింది. అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ కు పద్దెనిమిదేళ్లకు పైబడిన వారు మాత్రమే కాకుండా 42 ఏళ్లకు పైబడిన వారు కూడా రాజకీయాల్లోకి వస్తే మద్దతు తెలుపుతామని చెబుతున్నారని ఆ సంస్థ సర్వే లో వెల్లడయినట్లు కేకే సంస్థకు చెందిన కిరణ్ కోటేటి తెలిపారు. 2009 ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల జోలికి రాకపోయినా ఆయన ను కావాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఒకింత ఆశ్చర్యకరమేనని చెప్పాలి.
మరోసారి హాట్ టాపిక్...
దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఏ పార్టీకి మద్దతుదారుగా లేరు. తన తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉన్నానంటూ పలు మార్లు ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఎందులోకి వస్తారు? తెలుగుదేశం పార్టీలో ఇప్పుడయితే ఖాళీ లేదు. ఎందుకంటే నారా లోకేశ్ యువనేతగా టీడీపీలో పాతుకుపోయారు. టీడీపీ భవిష్యత్ నేతగా ఆయన ఎమర్జ్ అయ్యారు కూడా. ఆయన టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. రేపో మాపో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలున్నాయి. అదే సమయంలో చంద్రబాబు తర్వాత టీడీపీ వారసత్వం కూడా లోకేశ్ కు మాత్రమే చెల్లుతుంది.
సఖ్యత లేకపోయినా...
ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయనకు తెలుగుదేశం పార్టీ అంటే వల్లమాలిన ప్రేమ. అదే సమయంలో నారా కుటుంబంతో అంత సఖ్యత లేదు. తన తండ్రి హరికృష్ణ నుంచి ఆ గ్యాప్ అలాగే కొనసాగుతుంది. అదే సమయంలో టీడీపీని టేకోవర్ చేసే అవకాశం కూడా లేదు. ఎవరో అభిమానులు ఆశించినంత మాత్రాన అది ఆచరణలో సాధ్యమయ్యే పనికాదు. రాజకీయం వేరు.. సిల్వర్ స్క్రీన్ వేరు. పైగా జూనియర్ ఎన్టీఆర్ ది చిన్న వయసు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మరిన్ని సినిమాలు చేయాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సమయంలో ఏపీ రాజకీయాల్లోకి వేలు పెడతారని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఆయన అనేక సార్లు ఇందుకు సంబంధించిన క్లారిటీ ఇచ్చేశారు.
ఇప్పుడున్న సమయంలో...
తనకు సినిమాలంటే పిచ్చి అని అదే సమయంలో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే ప్రేమ అని చెప్పారు. అంత మాత్రాన బంగారం లాంటి అవకాశాలున్న సినీ రంగాన్ని వదులుకుని ఏదో సాధిద్దామని, సేవ చేద్దామని అయితే ఈ వయసులో ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. ఇంకా అందుకు చాలా సమయం ఉంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆగమానికి కూడా సరైన సమయం కాదు. ఏపీలో పర్టిక్యులర్ గా టీడీపీ, వైసీపీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాయి. టీడీపీ దారుణంగా దెబ్బతిన్న సమయంలోనే ఆ ఛాన్స్ జూనియర్ కు దక్కే అవకాశముంది తప్పించి ఇప్పట్లో తారక్ రాజకీయ తెరపై మెరిసే అవకాశం లేదన్నది మాత్రం వాస్తవమని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Next Story