Sat Dec 13 2025 22:43:17 GMT+0000 (Coordinated Universal Time)
మూఢమి మొదలయింది.. మూడు నెలలు ముహూర్తాల్లేవ్... పెళ్లి కాని ప్రసాదులకు కష్టకాలమే
పెళ్లిళ్ల సీజన్ పూర్తయింది. శుభకార్యాలకు బ్రేక్ పడింది.

పెళ్లిళ్ల సీజన్ పూర్తయింది. శుభకార్యాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం మూఢమి మొదలయింది. గత నెల 26వ తేదీ నుంచి మూఢమి మొదలయిందని పండితులు చెబుతున్నారు. మొత్తం 83 రోజుల పాటు మూఢమి ఉంటుందని చెబుతున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం ఒక ఏడాదిలో మాఘ, శ్రావణ, వైశాఖ మాసాలు శుభకార్యాలకు అనువైనవి. మిగిలిన మాసాల్లో కూడా ముహూర్తాలను అనుసరించి శుభకార్యాలు జరిగినప్పటికీ, ఎక్కువగా ఈ మాసాల్లోనే జరుగుతుంటాయి.కానీ ఈ సంవత్సరంలో పెళ్లిళ్లకు శ్రేష్టమైన మాఘ మాసంలో వివాహా ముహుర్తాలు లేవు. శుక్ర మూఢమి కారణంగా ఈసారి మాఘంలో సన్నాయి మేళాలు లేనట్లే. మరో రెండున్నర నెలలు ఇక శుభకార్యాలు లేవని పండితులు చెబుతున్నారు.
మూఢమి అంటే?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూఢాలు రెండు రకాలు. ఒకటి గురు మూఢమి, రెండోది శుక్ర మూఢమి. గురు శుక్ర గ్రహాలు అస్తంగత్వం చెందడం అంటే తేజస్సును కోల్పోవడం అనేది ముహూర్త శాస్త్రంలో చాలా కీలకమైనది. ఈ సమయంలో శుభకార్యాలు నిషేధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. గురువు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని గురు మౌడ్యమి అని, శుక్రుడు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని శుక్ర మౌడ్యమి అని అంటారు. దీనినే వాడుక భాషలో మూఢమి అని వ్యవహరిస్తారు, నవగ్రహాల్లో గురుడు, శుక్రుడు తమ గమనంలో భాగంగా సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహాలు తమ స్వయం కాంతిని కోల్పోవడం వలన మూఢమి సంభవిస్తుంది.నవగ్రహాలకు అధిపతి సూర్యుడు, సూర్యుడు అతి పెద్ద గ్రహం, ఆయన తేజస్సు, శక్తి అనంతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు శుక్ర గ్రహాలను శుభ గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే సూర్యునికి దగ్గరగా ఈ గ్రహాలు వచ్చినప్పుడు వాటి తేజస్సు కోల్పోవడం వలన మౌడ్యమి ఏర్పడి శుభకార్యాలు నిషేధిస్తారు. మూఢమి అలా ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.
మూఢమి సమయంలో ఇవి నిషిద్ధం...
మూఢమి సమయంలోలో వివాహాది శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, గృహ నిర్మాణ ప్రారంభాలు, శంఖుస్థాపనలు, యజ్ఞాలు, నూతన వధువు గృహప్రవేశం, యజ్ఞం, దీక్షోపనయనం, వ్యాపార ప్రారంభాలు, మహాదానాలు, పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, నూతన వ్యాపారాలు ఆరంభించడం, రాజ దర్శనం, రాజ్యాభిషేకం, బావులు చెరువులు తవ్వించడం వంటివి నిషిద్ధం. కానీ కొన్ని అనివార్య కార్యాలకు, నిత్య నైమిత్తిక కర్మలకు మూఢం వర్తించదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందులో భాగంగా నిత్య ప్రయాణాలు, నిత్య దైవారాధన, అభిషేకాలు, గ్రహశాంతి పూజలు, జప హోమాది శాంతులు, సీమంతం, నామకరణం, అన్నప్రాశన, ఇంటి మరమ్మత్తులు, అద్దె ఇళ్లలో చేరడం, నూతన వస్త్ర ధారణ, చాతుర్మాస వ్రతాలు వంటివి మూఢంలో కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కావున మరో రెండున్నర నెలల పాటు పెళ్లి బాజాలు మోగనట్లే.
Next Story

