Fri Dec 05 2025 11:14:38 GMT+0000 (Coordinated Universal Time)
Rapthadu : ఎందుకీ సవాళ్లు.. సీమలో మళ్లీ మొదలయినట్లేనా?
రాప్తాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత మధ్య మాటల యుద్ధం మొదలయింది

రాయలసీమలో ఫ్యాక్షన్ తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. ఇటు వైసీపీ, అటు టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ ఇందుకు నిదర్శనం. పరిటాల రవి హత్య తర్వాత కొన్నాళ్లు పాటు ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లాలో తిరిగి ఘర్షణ వాతావరణం తలెత్తింది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరుకుంది. తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని అడుగుపెట్టనివ్వనని జేసీ, ఎలా అడ్డుకుంటాడో చూస్తానంటూ పెద్దారెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఇదే రకమైన వ్యవహారం ఇప్పుడు అదే జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలోనూ కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత మధ్య వార్ మొదలయింది.
తోపుదుర్తి సవాల్ వింటే...
ఇద్దరు నేతలు తగ్గేదేలేదంటున్నారు. రాప్తాడులో కొంతకాలం జగన్ పర్యటించిన తర్వాత ఇది మరింత తీవ్రంగా మారింది. రాప్తాడు నియోజకవర్గంలో అవినీతిపైన తాను పోరాటం చేస్తానని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అంటుంటే.. గత ప్రభుత్వంలోనే అవినీతి విచ్చలవిడిగా జరిగిందని, త్వరలో తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని సునీతమ్మ అంటున్నారు. దీనిపై ప్రకాశ్ రెడ్డి స్పందించారు. తాను నాలుగైదు నెలలకు జైలుకు వెళ్లనని ఇరవై 0సంవత్సరాల పాటు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రకాష్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. గతంలోనూ పరిటాల రవీంద్ర అరాచకాలపై తాను పోరాడిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. తాను మానసికంగా సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పారు.
ఘాటుగా స్పందించిన సునీత...
అయితే దీనికి పరిటాల సునీత ఘాటుగా స్పందించారు. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే మళ్లీ హత్యలు చేసేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఇరవై ఏళ్లు జైలులో ఉండాలంటే హత్యలు చేసే వెళ్లాలని, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకొని జాగ్రత్తగా ఉండు ప్రకాష్ రెడ్డి అంటూ సునీతమ్మ హెచ్చరించారు. తాము నీలాగా ఆలోచిస్తే.. నువ్వు ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతావా అని ప్రశ్నించారు. గతంలో జరిగిన చరిత్రను వక్రీకరిస్తూ మీ పార్టీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొడుతున్నావంటూ మండిపడ్డారు. పరినువ్వు చేసిన పాపాలు పండాయని.. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పరిటాల సునీత సూచించారు. తమ ప్రభుత్వంలో అంతా చట్ట ప్రకారం ఉంటుంది కాబట్టే నీ జైలు బాటకు కాస్త సమయం పడుతోందన్నారు. దీంతో రాప్తాడు నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ నెలకొంది.
Next Story

