Tue Mar 03 2026 11:12:48 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : కొత్త జాతీయ రహదారి నిర్మాణం అవసరమా? ఉన్న రహదారిని విస్తరిస్తే సరిపోదూ?
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి ఉండగా మరొక కొత్త జాతీయ రహదారి నిర్మాణం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి ఉండగా మరొక కొత్త జాతీయ రహదారి నిర్మాణం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు. రైతులు మాత్రమే కాదు. ఎమ్మెల్యేలు కూడా అభ్యంతరం చెబుతున్నారు. మైలవరం టీడీపీ శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ సయితం అభ్యంతరం తెలిపారు. ఉన్న జాతీయ రహదారి విస్తరణ చేపడితే మంచిదని, అంతే తప్ప కొత్త జాతీయ రహదారి నిర్మాణ ప్రతిపాదన అనవసర చర్య అని ఆయన సమావేశంలోనే అధికారులకు సూచించారు. దీనివల్ల రైతులతో పాటు అనేక మంది భూములు కోల్పోతారని, విలువైన భూములు ఇచ్చేందుకు మైలవరం, నందిగామ ప్రాంత రైతులు సిద్ధంగా లేరని ఆయన కుండ బద్దలు కొట్టారు.
కంచికచర్ల నుండి ఇబ్రహీంపట్నం వరకూ
కంచికచర్ల నుండి ఇబ్రహీంపట్నం వరకూ కొత్త జాతీయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలతో ఆ ప్రాంత ప్రజలు, రైతుల్లో తీవ్ర ఆందోళన పెరుగుతోంది. ప్రాజెక్టుకు ఇప్పటికే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా సిద్ధమవడంతో ఖచ్చితంగా నిర్మిస్తారని, దీనివల్ల పంటపొలాలు దెబ్బతింటాయనే ఆందోళనా పెరుగుతోంది. ఇప్పటికే కంచికచర్ల ప్రాంతంలో పాత జాతీయ రహదారి, బైపాస్‌రోడ్డు, రైల్వేలైను, అవుటర్‌రింగురోడ్డు, ఇన్నర్రింగురోడ్డు, రైల్వేలైనుకు విడతల వారీగా పొలాలు ఇచ్చామని, ఇప్పుడు జాతీయ రహదారి కొత్త ప్లానులో మిగిలిన పొలాలు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బఫర్ జోన్ పరిధిలో రోడ్డు వేస్తే కృష్ణానది వరద ఒత్తిడి పెరిగే ప్రమాదమూ ఉందని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.
వరద ముప్పు ఉంటుందని...
కొత్తగా నిర్మించే రోడ్డును ఇప్పుడున్న నేలమట్టానికి కనీసం పదిఅడుగుల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించారు. అంటే కృష్ణానదికి కరకట్ట మాదిరి ఉంటుంది. వాస్తవంగా కృష్ణానది వరద వచ్చిన సమయంలో బ్యారేజీ ఎగువ భాగంలో మునేరు వరకూ బఫర్‌జోన్‌గా వదిలారు. అంటే పెద్దఎత్తున ప్రకాశం బ్యారేజీపై ఒత్తిడి పెరగకుండా వరద నీరు విస్తరిస్తోంది. నెమ్మదిగా ప్రవాహం దిగువకు వెళుతోంది. అమరావతి నుండి దిగువకు గుంటూరు జిల్లాలో కరకట్ట నిర్మించారు. అదే సమయంలో మెరకగా ఉందని, మునేరువైపు నుండి వచ్చే వరద పెరిగినా ఇబ్బంది ఉండదనే కోణంలో ఉమ్మడి కృష్ణాజిల్లావైపు కరకట్టను నిర్మించలేదు. దీనివల్ల ఇటీవల వచ్చిన వరదల్లో నీరు ఎన్టిఆర్ జిల్లా వైపు నీరు విస్తరించడం వల్ల బ్యారేజీకి నీటి ఒత్తిడి తగ్గిందని అధికారులు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త జాతీయ రహదారిని పది నుండి 12 అడుగుల ఎత్తులో నిర్మిస్తే కృష్ణానదికి వరద వచ్చిన సమయంలో బ్యారేజికి ఒత్తిడి పెరుగుతుందని అధికారులూ చెబుతున్నారు.
అమరావతికి తగులుతుందనే...
ఈ ఒత్తిడి గుంటూరు జిల్లావైపు అమరావతికి తగులుతుందనే అనుమానమూ వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు కంచికచర్ల నుండి ఇబ్రహీంపట్నం వరకూ విస్తరించే రోడ్డు నిర్మాణానికి సుమారు 5200 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని లెక్కలేశారు. అదే పాత జాతీయ రహదారికి గతంలో తీసుకున్న భూమిని విస్తరించి ఇళ్లు ఉన్న చోట్ల వాటికి ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్లు నిర్మిస్తే 3500 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని అంచనాలు వేశారు. ఇదే అంశాన్ని రైతులు కూడా ముందుకు తీసుకొస్తున్నారు. కొత్త రహదారి నిర్మాణానికి 70 మీటర్ల వెడల్పు ప్రతిపాదించారు. దీనివల్ల ఒక్క పరిటాల గ్రామంలోనే 40 ఎకరాల వరకూ అవసరం అవుతుంది. చిలుకూరులో 40 ఎకరాలు భూములు కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచించాలని, పాత రహదారిని గ్రామాలు, ఇళ్లకు ఇబ్బందులు లేకుండా ఫ్లైఓవర్లు నిర్మించే పద్ధతిలో విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. కృష్ణానది బఫర్‌జోన్‌ను మూసేస్తే బ్యారేజీపై ఒత్తిడిపడే అంశాన్ని ఇటీవల ఎన్హెచ్ఎఐ సమావేశంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధిులు కూడా కుండ బద్దలు కొట్టారు.
Next Story

