Fri Feb 06 2026 06:09:10 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడ వైద్యురాలు మృతి పై వీడని మిస్టరీ
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న వైద్యురాలి మృతి సంచలనం కలిగించింది

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న వైద్యురాలి మృతి సంచలనం కలిగించింది. తెల్లవారుజామున ఆసుపత్రి వార్డులోనే డాక్టర్ దీపిక మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అనంతపురం జిల్లా చెందిన దీపిక, ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్లో మెడిసిన్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది. ప్రతి రోజూ మాదిరిగానే నిన్న రాత్రి కూడా ఆమె డ్యూటీకి హాజరైందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కానీ యితే, ఆసుపత్రి వార్డులో డ్యూటీలో ఉన్న సమయంలోనే, తెల్లవారుజామున దీపిక అపస్మారక స్థితిలో పడిపోయినట్టు సమాచారం. విధుల్లో ఉన్న ఇతర వైద్యులు వెంటనే ఆమెను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.
కడుపు నొప్పితో బాధపడుతూ...
దీంతో ఆసుపత్రిలో సిబ్బంది ఒక్కసారి షాక్ కు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. దీపిక నిన్న రాత్రి తీవ్ర కడుపు నొప్పితో బాధపడినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె స్వయంగా చికిత్స కోసం ఇంజెక్షన్ తీసుకున్నట్టు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, దీపిక చేతిపై ఇంజెక్షన్ తీసుకున్న గుర్తులు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఆ ఇంజెక్షన్ ఏ మందుకు సంబంధించినది, అది వైద్యపరంగా అనుమతించబడినదేనా..? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు. అనంతపురం నుంచి దీపిక తల్లిదండ్రులు విజయవాడకు చేరుకున్న తర్వాత, వారి ఫిర్యాదు ఆధారంగా పూర్తి స్థాయి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.
ఎందుకన్నది...?
అవసరమైతే పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. అయితే, డ్యూటీలో ఉన్న సమయంలోనే వైద్యురాలు మృతి చెందడం జీజీహెచ్ వైద్యులు, పీజీ విద్యార్థుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సహచరులు దీపిక మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న వైద్యురాలి అకస్మిక మృతి వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తల్లిదండ్రుల ఫిర్యాదు, పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ వైద్యురాలు ఎందుకు మరణించిందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు చెప్పాల్సి ఉంది.
Next Story

