Sat Dec 06 2025 01:01:47 GMT+0000 (Coordinated Universal Time)
TDP: బొండాలో ఫ్రస్టేషన్ అదేనా? పవన్ పై కోపం అందుకేనటగా
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల్లో కలకలం రేపాయి

టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు జనసేన అంటే పడటం లేదా? ఆయన అసెంబ్లీ సమావేశాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడాన్ని అనేక కోణాల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి. బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన ఈసారి మంత్రి పదవిని ఆశించారు. కానీ జనసేనతో పాటు టీడీపీలో ఉన్న కాపు సామాజికవర్గం నేతలకు ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాల్సి రావడంతో బొండా ఉమామహేశ్వరరావుకు తాను ఆశించినట్లు మంత్రి పదవి దక్కలేదు. భవిష్యత్ లోనూ దక్కుతుందన్న గ్యారంటీ మాత్రం కనిపించడం లేదు.
సామాజికవర్గం.. జిల్లా కోటాలో...
ఎందుకంటే బొండా ఉమామహేశ్వరరావు కాపు సామాజికవర్గం కావడంతో పాటు కృష్ణా జిల్లా కావడంతో జిల్లా కోటాలో, సామాజికవర్గం కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు భవిష్యత్ లో లేవన్నది అంచనా. ఎందుకంటే పొంగూరు నారాయణకు ఖచ్చితంగా కేబినెట్ లో కీలకంగా ఉంటారు. అదే సమయంలో కృష్ణా జిల్లా నుంచి ఇతర సామాజికవర్గానికి చెందిన నేతలకు మాత్రమే మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జనసేన వల్లనే తనకు మంత్రి పదవి దక్కలేదన్న అక్కసు ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీలో ఒక సంప్రదాయం ఉంది. ఏ సామాజికవర్గం వారిని ఆ సామాజికవర్గం వారి చేతనే విమర్శలు చేయిస్తారు. అలాడే టీడీపీ అధినాయకత్వం ఆదేశాల మేరకు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారా? లేక ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయమా? అన్నది తేలాల్సి ఉంది.
పవన్ ను నేరుగా విమర్శించకపోయినా...
కాలుష్య నియంత్రణ మండలి విభాగానని కూడా చూస్తున్న పవన్ కల్యాణ్ ను నేరుగా విమర్శించకపో్యినా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిత్వ శాఖపై విమర్శలు చేయడంతో జనసైనికులు మండిపడుతున్నారు. గతంలో అంటే 2019 లో కాపు సామాజికవర్గం టీడీపీ నేతగా బొండా ఉమామహేశ్వరరావు పవన్ కల్యాణ్ పై చేసిన విమర్శలను ఈ సందర్భంగా జనసైనికులు గుర్తు చేస్తున్నారు. అయితే దీనిపై పవన్ కల్యాణ్ కూడా ఒకింత సీరియస్ గానే ఉన్నట్లు కనపడుతుంది. ఈ విషయంలో ఆయన పర్యావరణ శాఖ అధికారుల నుంచి పూర్తి వివరాలను ఇప్పటికే తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దీనిపై ఒక రిపోర్టు ఇవ్వడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు కనపడుతున్నారని అంటున్నారు.
అసలు జరిగింది ఇదట...
బొండా ఉమామహేశ్వరరావు తన నియోజకవర్గం పరిధిలో ఒక కంపెనీపై కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేయడమే కాకుండా, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారని చెబుతున్నారు. కాలుష్యం వెదజల్లుతున్న ఆ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలిని బొండా ఉమామహేశ్వరరావు కోరారంటున్నారు. వెంటనే అధికారులు ఆ కంపెనీకి నోటీసులు ఇవ్వడమే కాకుండా చర్యలకు కూడా సిద్ధమవుతున్న సమయంలో తిరిగి ఫిర్యాదు చేసిన బొండా ఉమామహేశ్వరరావు చర్యలు తీసుకోవద్దని కోరినట్లు పవన్ కల్యాణ్ కు ఇచ్చిన నివేదికలో అధికారులు తెలిపినట్లు సమాచారం. అంటే ఇక్కడ ఏదో జరిగిందని పవన్ కల్యాణ్ కూడా అనుమానిస్తూ దీనిపై చంద్రబాబు వద్ద పంచాయతీ పెట్టాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తాను లేవనెత్తిన ప్రశ్నలకు వెంటనే రియాక్ట్ అయ్యారని, వేగంగా స్పందించారని ట్వీట్ చేయడం చూస్తుంటే .. నాయకత్వం తలంటినట్లే కనిపిస్తుంది.
Next Story

