Mon Mar 30 2026 16:11:30 GMT+0530 (India Standard Time)
Vijaya Sai Reddy : సాయిరెడ్డి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తున్నారా? సిగ్నల్స్ అవేనా?
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యవహారం ఏదో తేడా కొడుతున్నట్లు కనిపిస్తుంది

మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యవహారం ఏదో తేడా కొడుతున్నట్లు కనిపిస్తుంది. త్వరలోనే ఆయన రాజకీయ ప్రకటన చేయనున్నారు. ఈ మధ్యనే ఆ విషయాన్ని ప్రకటించారు. జూన్, జులై నెలలో విజయసాయిరెడ్డి రాజకీయ ప్రకటన ఉండనుంది. ఏ పార్టీలో చేరతారన్నదానిపై స్పష్టత ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరో చర్చకు దారి తీసినట్లు కనిపిస్తుంది. విజయసాయిరెడ్డి వైసీపీలో చేరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనపడుతుంది. ఎందుకంటే ఎక్స్ వేదికగా సాయిరెడ్డి నేడు చేసిన ప్రకటన అలాగే కనపడుతుంది.
ఆయన పోస్టు చూసిన వారికి...
రాజధాని అమరావతి రైతుల కోసం మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గతంలో ఎప్పుడు మాట్లాడలేదు. తాజాగా ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు వేశారు.ఒక రైతుగా అడుగుతున్నానని చెప్పినప్పటికీ, అమరావతికి 2015లో ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రైతుల్లో ఎవరైనా వారికి కేటాయించిన ప్లాట్‌లో ఇల్లు కట్టుకోగలిగారా? వారిలో ఏ ఒక్క రైతు అయినా వారికి ఇచ్చిన కమర్షియల్ స్థలంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టగలిగారా? ఈ 11 ఏళ్ళ కాలంలో వారికి కేవలం ఏడాదికి ఇంత అని నామమాత్రంగా డబ్బు ఇవ్వటం వల్ల కలిగిన లాభం ఏమిటి?" అని ప్రశ్నించారు. దీనిని బట్టి కూటమిలోని ఏ పార్టీలో చేరరన్నది విజయసాయిరెడ్డి పోస్టు ద్వారా స్పష్టమయింది.
రైతుల మీద ఎందుకంత ప్రేమ?
కూటమిలోని ఏ పార్టీలో చేరేందుకు అవకాశముంటే ఈ ప్రశ్నలు విజయసాయిరెడ్డి వేసి ఉండేవారు కాదు. అధికార పార్టీని నిలదీసేంతగా మాట్లాడారంటే ఆయన వైసీపీలో చేరేందుకు అవకాశాలున్నాయని చెబుతున్నారు. లేకపోతే రాజధాని రైతుల మీద సాయిరెడ్డికి ఎప్పుడూ లేనంత ప్రేమ ఎందుకు వస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీజేపీలో ఆయన చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో తిరిగి వైసీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, అందుకే విజయసాయిరెడ్డి రాజధాని రైతులకు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?
Next Story

