Fri Dec 05 2025 12:38:43 GMT+0000 (Coordinated Universal Time)
Mylavaram : వసంత లైన్ దాటారా? దేవినేనికి హింట్ ఇచ్చారా?
మైలవరం శాసనసభ నియోజకవర్గం ప్రస్తుత శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానని ప్రకటించారు

మైలవరం శాసనసభ నియోజకవర్గం ప్రస్తుత శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానని ప్రకటించారు. తనకు తానే ప్రకటించుకుని ఒకరకంగా మాజీ మంత్రి దేవినేని ఉమకు హింట్ ఇచ్చారు. మైలవరాన్ని తాను వదిలేది లేదని వసంత కృష్ణ ప్రసాద్ చెప్పడం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఎన్నికలు ఇప్పుడు లేవు. 2029 ఎన్నికలలో తానే మైలవరం నుంచి పోటీ చేస్తానని తనకు తానే ప్రకటించుకోవడం పట్ల పార్టీ నాయకత్వం కూడా ఒకింత సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో పొత్తులుంటాయి. అదీ కాకుండా అప్పటి గెలుపును అంచనా వేసి అభ్యర్థిని నిర్ణయిస్తారు. కానీ వసంత మాత్రం తానే పోటీ చేస్తానని చెప్పడం థిక్కారమేనంటున్నారు ఉమ వర్గీయులు.
మూడోసారి కూడా...
మైలవరం నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరి టిక్కెట్ సాధించి తిరిగి మైలవరం నుంచి పోటీ చేసి 43 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వసంత కృష్ణ ప్రసాద్ మూడోసారి కూడా తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో మైలవరం నుంచి తాను పోటీ చేస్తానని, వసంతను ఓడిస్తానని మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా వసంత కృష్ణ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నప్పటికీ ఆయన మనసులో మాట చెప్పకనే చెప్పినట్లయింది. అంటే ఈసారి కూడా మాజీ మంత్రి దేవినేని ఉమను మైలవరానికి ఎంటర్ కానివ్వబోనని చెప్పినట్లయింది.
అలా జరిగితేనే...
దేవినేని ఉమ టీడీపీలో సీనియర్. చంద్రబాబు, లోకేశ్ లకు అత్యంత సన్నిహితుడు. సోదరుడు దేవినేని రమణ మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన దేవినేని ఉమ తొలి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. కానీ ఉమ నాయకత్వాన్ని కొందరు స్థానిక నేతలు వ్యతిరేకించడంతో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నాయకత్వం టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీలోనే నమ్మకంగా కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనకు వస్తుందని దేవినేని ఉమ కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నందిగామ జనరల్ నియోజకవర్గం అయితే దేవినేని ఉమ అక్కడకు వెళ్లే అవకాశముంది. అయినా కూడా వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం ఎన్నికలకు మూడేళ్లు ముందే మైలవరం నాదేనని ప్రకటించడం పట్ల పార్టీ నాయకత్వం కూడా ఆగ్రహంగా ఉందని తెలిసింది. మరి దేవినేని దీనిపై ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి.
Next Story

