Sun Dec 14 2025 00:24:24 GMT+0000 (Coordinated Universal Time)
Vangaveeti : వంగవీటి కుటుంబంలో ఏం జరుగుతోంది?
రాజకీయాల్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కొరవడింది

రాజకీయాల్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కొరవడింది. ఒక కుటుంబంలోని అన్నాచెల్లెళ్లు వేర్వేరు దారులు చూసుకోవడం ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో చూశాం. వైఎస్ జగన్ తో ఆయన సోదరి వైఎస్ షర్మిల విభేదించి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ గా కొనసాగుతున్నారు. ఇక బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్ తో విభేదించి పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురై తాను ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకుంటున్నారు. ముద్రగడ కుటుంబంలోనూ సోదరుడు, సోదరి మధ్య రగడ ఎంత దూరం వెళ్లిందో అందరికీ తెలుసు. ముద్రగడ కుమారుడు గిరిబాబు, కుమార్తె క్రాంతి రాజకీయంగా విడిపోయారు. గిరబాబు వైసీపీలో ఉంటే, క్రాంతి జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
రంగా వారసుడిగా ఇన్నాళ్లు...
అయితే తాజాగా వంగవీటి కుటుంబంలోనూ అదే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకూ వంగవీటి రంగా వారసుడిగా రాధా మాత్రమే రాజకీయాల్లో కనిపించారు. తాజాగా రంగా కుమార్తె ఆశా కిరణ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వంగవీటి రాధాకు వివాహమై, తండ్రి అయిన తర్వాత మాత్రమే ఈ పరిణామం చోటు చేసుకోవడంపై కూడా కొందరు రంగా అభిమానులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. వంగవీటి రాధా దాదాపు రెండు దశాబ్దాల నుంచిరాజకీయాల్లో ఉన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా, ఆయన అనేక పార్టీలు మారినా ఆశా కిరణ్ మాత్రం మొన్నటి వరకూ అసలు బయట కనిపించలేదు. రంగా వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనలేదు.
కుమార్తె రావడంతో...
కానీ తాజాగా ఆమె ఒక్కసారి బయటకు వచ్చి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.ఆమె అడుగులు రాజకీయం వైపు పడుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. సోదరుడికి అండగా ఉంటారా? లేక సోదరుడిని విభేదించి వేరే పార్టీలో చేరతారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు కానీ, వంగవీటి కుటుంబంలోనూ కొంత మార్పు కనిపిస్తుందన్న ఆందోళన, ఆవేదన మాత్రం రంగా అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా సోదరుడితో విభేదించడానికే అన్నట్లున్నాయి. రాధా, రంగా మిత్రమండలి తో గ్యాప్ ఉందని, ఆ గ్యాప్ ఫుల్ ఫిల్ చేయడానికే వస్తున్నానని చెప్పడం కూడా ఈ చర్చకు దారి తీసింది. మొత్తం మీద తల్లి రత్నకుమారి మాత్రం ఇంటికే పరిమితమయినా సోదరుడు, సోదరి వేరు కుంపటి పెట్టుకున్నారా? అన్న చర్చ బెజవాడ రాజకీయాల్లో ఊపందుకుంది.
Next Story

