Sat Dec 06 2025 02:30:55 GMT+0000 (Coordinated Universal Time)
Vallabhaneni Vamsi : వల్లభనేనేని వంశీ ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లేనా? నిజమెంత?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఆయన జైలు నుంచి విడుదలయి దాదాపు రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ గన్నవరం నియోజకవర్గంలో పర్యటించకపోవడం వెనక కారణమదేనని అంటున్నారు. వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు కూడా రాజకీయాలు మానుకుని, వ్యాపారాలు చూసుకోవాలని సూచిస్తున్నట్లు తెలిసింది. రాజకీయాల వల్ల ఆరోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, దానికంటే వ్యాపారాలు చేసుకోవడమే బెటరన్న అభిప్రాయంలో వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు ఉన్నారు. దీంతో ఆయన కూడా పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు.
జైలు నుంచి విడుదలయి...
వల్లభనేనేని వంశీ విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదల అయి రెండు నెలలు పైనే అవుతుంది. అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. వల్లభనేని వంశీపై పదకొండు కేసులు నమోదు కావడంతో దాదాపు 137 రోజుల పాటు విజయవాడ జిల్లా జైలులోనే ఉన్నారు. కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్, మరికొన్నికేసుల్లో షరతులతో కూడిన బెయిల్ లభించింది. పోలీస్ స్టేషన్లలో సంతకాలు చేయాలన్న షరతులను ఆయన పాటిస్తున్నారు. అంతే తప్ప రాజకీయాల జోలికి మాత్రం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోవడం లేదు. అదే సమయంలో జైలు నుంచి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలసిన తర్వాత మళ్లీ కనిపించకుండా పోయారు.
కానీ ముఖ్య కార్యకర్తలు మాత్రం...
కానీ గన్నవరం నియోజకవర్గానికి త్వరలో వల్లభనేనేని వంశీ వస్తారని నియోజకవర్గంలోని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్య కార్యకర్తలతోవల్లభనేనేని వంశీ టచ్ లో ఉన్నారని, ఫోన్ లో మాట్లాడుతున్నారని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వస్తారని అంటున్నారు. జైల్లో ఉన్న సమయంలో ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధి రావడంతో ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారని, ఆరోగ్యం పడిన తర్వాత తిరిగి గన్నవరం నియోజకవర్గానికి వల్లభనేనేని వంశీ వస్తారని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న వల్లభనేనేని వంశీ ఆరోగ్య పరీక్షలు తరచూచేయించుకుంటున్నారని అంటున్నారు. మొత్తం మీద వంశీ రాజకీయాలను వదిలేస్తారన్న ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది. ఇందులో నిజమెంత? అన్నది తెలియాలంటే ఆయన మాత్రమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Next Story

