Fri Feb 14 2025 18:28:34 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో గేమ్ మొదలయినట్లేనా? జగన్ జైలుకు వెళ్లడం ఖాయమా?
అనుకోని ఘటనలు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నాయి. ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి.

అనుకోని ఘటనలు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నాయి. ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. బిగినింగ్ లోనే ఇలా ఉంటే.. ఎండింగ్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం. ఎందుకంటే కరడుగట్టిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఇక ఏం జరిగినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దీనిపై సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వినపడుతున్నాయి. జగన్ మళ్లీ జైలుకు వెళ్లే సమయం దగ్గరపడిందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి కూడా. జగన్ ను జైల్లో వేస్తే వైసీపీ అస్సలు ఉండదన్న అంచనాలో ప్రత్యర్ధి పార్టీల అగ్రనేతలున్నారు. కేవలం ఒక్కసారి ఓటమితోనే అనేక మంది నేతలు పార్టీని వీడుతుండటంతో ఇక ఈసారి జైలుకెళితే ఒక్కరూ మిగలరన్న అంచనాల్లో అధినాయకులు ఉన్నట్లే కనిపిస్తుంది.
ముఖచిత్రం మారిపోనుందా?
వైఎస్ జగన్ గతంలో జైలుకు వెళ్లినప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు వేరు అని లెక్కలు వేసుకుంటున్నారు. అప్పుడు వచ్చిన సింపతీ ఇప్పుడు రాకపోవచ్చన్న గణాంకాలతో సహా కొందరు చెబుతున్నారు. అంజనం వేసి మరీ చూడాల్సిన అవసరం లేదని, ప్రజలతో పాటు క్యాడర్ కూడా ఈసారి జగన్ వెంట నడిచే అవకాశం లేకపోవచ్చన్న ధీమా వారిలో కనపడుతుంది. జగన్ కేసులు చివరి దశకు చేరుకున్నాయి. అనేక కేసులు ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి.ఆ కేసులు న్యాయపరంగా నిలబడతాయా? లేదా? అన్నది పక్కన పెడితే కొంతకాలం జైలు జీవితం జగన్ గడపక తప్పదని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు యాభై మూడు రోజుల పాటు స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్నారు.
అందులో భాగంగానే...
జగన్ ను జైలుకు పంపడంలో భాగంగానే ఈ రాజీనామాలంటూ పెద్దయెత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. జగన్ పక్కన ఉన్న వారిని ముందు బయటకు పంపి, ఒంటరిని చేసిన తర్వాత జగన్ ను జైలుకు పంపితే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావన్న భావనలో ఉన్నారు. పార్టీని లీడ్ చేసే వారిని ఒక్కొక్కరిని పార్టీ నుంచి బయటకు పంపి తర్వాత జగన్ ను జైలు కు పంపాలన్న భావన కనపడుతుందని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అయితే జనంలో వచ్చే సానుభూతి వెల్లువను ఎవరూ ఆపలేరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జగన్ జైలుకెళితే ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారిపోతుందన్న అంచనాలు కూడా సోషల్ మీడియాలో పెద్దయెత్తున వినిపిస్తున్నాయి.
టీడీపీ కూడా జాగ్రత్త పడాలంటూ...
ఏపీలో బీజేపీ, జనసేన పార్టీ బలం పెంచుకోవడానికి ఇది ఒక మార్గమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కూటమి పార్టీలోని బీజేపీ ఆడుతున్న గేమ్ లో భాగమేనంటూ కొందరు పోస్టింగ్ లు పెడుతున్నారు. ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న గేమ్ లో భాగంగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారంటూ అనేక మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సెగ కేవలం జగన్ తోనే ఆగిపోదని, చంద్రబాబు పార్టీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు టీడీపీ సానుభూతి పరులు నెట్టింట సూచిస్తున్నారు. ఢిల్లీ టీం ను గుడ్డిగా నమ్మితే అంతకంటే పెద్ద జోక్ మరేదీ ఉండదని, దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసైనా చంద్రబాబు జాగ్రత్తలు పాటించాలని పలువురు ఇప్పటికే తమ సూచనలు అందచేస్తున్నారు. మొత్తం మీద ఏపీలో ఏదో జరుగుతుందన్నది మాత్రం తెలుస్తుంది. కానీ అది ఏంటన్నది మాత్రం ఎప్పటికప్పుడు సస్పెన్స్ గానే కొనసాగుతుంది.
Next Story