Tue Jul 08 2025 18:17:29 GMT+0000 (Coordinated Universal Time)
ys Jagan : ఎక్కడో డౌట్ కొడుతుందన్నయ్యా... తేడాగా ఉందే?
వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై కూటమి పార్టీలోని రెండు పార్టీలే ఎక్కువగా స్పందిస్తున్నాయి

వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై కూటమి పార్టీలోని రెండు పార్టీలే ఎక్కువగా స్పందిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎటూ అందులో ముందుంటుంది. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా జగన్ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కానీ మూడో మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ మాత్రం జగన్ విషయంలో ఎందుకో మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. జగన్ చేసే విమర్శలను తిప్పికొట్టడానికి బీజేపీ నేతలు ఎవరూ పెద్దగా ముందుకు రావడం లేదు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నేతలు ఎవరూ జగన్ పై విమర్శలు చేయకపోవడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. కనీసం రాష్ట్రంలో బీజేపీ లో ఉన్న జగన్ వ్యతిరేక నేతలు కూడా పెదవి విప్పడం లేదు.
మోదీ మొదలు...
ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినా జగన్ ప్రస్తావన తేవడం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. గతంలో రాష్ట్రానికి వస్తే మోదీ, నిర్మాలా సీతారామన్, అమిత్ షా వంటి వారు వచ్చినప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శలు చేసే వారని, కానీ నేడు కేంద్ర మంత్రులు సయితం జగన్ పేరు ప్రస్తావించకపోవడం ఎక్కడో డౌట్ కొడుతుందని అంటున్నారు. రాజధాని అమరావతి పనుల రీలాంచ్ కు వచ్చిన సందర్భంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ జగన్ పేరును తన ప్రసంగంలో చోటు ఇవ్వలేదు. ఇక జగన్ కు బీజేపీలో వ్యతిరేకులు రాష్ట్రంలో చాలా మంది నేతలున్నారు. పురంద్రీశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు కూడా మౌనంగా ఉన్నారు.
జగన్ పర్యటనల్లో...
వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఇటీవల పొదిలి, రెంటపాళ్ల పర్యటనల్లో అపశృతి జరిగింది. పొదిలిలో వైసీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారంటూ కేసు నమోదయింది. అలాగే రెంటపాళ్ల పర్యటనలో జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు మరో కేసు నమోదయింది. అయినా సరే టీడీపీ, జనసేన నేతలు మినహాయించి బీజేపీ నేతల నుంచి రియక్షన్ పెద్దగా రాకపోవడం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. టీడీపీ సోషల్ మీడియాలో కూడా పలువురు సైకిల్ పార్టీ అభిమానులు ఇదే అనుమానాలను ప్రశ్నిస్తున్నారు. జగన్ పట్ల అంత సాఫ్ట్ కార్నర్ కమలం పార్టీకి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలతో అధినాయకత్వాన్ని నిలదీస్తున్నారు.
నివేదికలు అందాయా?
జగన్ పర్యటనలకు వస్తున్న ప్రజా స్పందనతో కేంద్ర ఇంటలిజన్స్ నివేదికలు ఏమైనా బీజేపీకి అందాయా? అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పార్టీ నుంచి ఆదేశాలు ఏమైనా వచ్చాయా? అని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై దారుణమైన విమర్శలు చేస్తున్నప్పటికీ కమలం పార్టీ నేతలు కామ్ గా ఎందుకుంటున్నారని? ఇదేదో లోపాయికారీ ఒప్పందంలా తమకు అనిపిస్తుందని కొందరు టీడీపీ సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అదే నిజమయితే కూటమికి భవిష్యత్ లో ఇబ్బందులు ఎదురు కాక తప్పదన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ఎన్నికలకు ముందు విమర్శలుచేసిన వారు ఇప్పుడు చేయకపోవడాన్ని చాలా మంది సోషల్ మీడియా హ్యాండిల్స్ లో గుర్తు చేస్తున్నారు.
Next Story