Fri Jan 09 2026 03:56:05 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో సంక్రాంతికి కూడా వ్యాపారాలు సాగడం లేదా?
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతికి వ్యాపారాలు లేవని వ్యాపారులు లబోదిబోమంటున్నారు

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతికి వ్యాపారాలు లేవని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గతంలో మాదిరి వ్యాపారాలు జరగడం లేదని బహిరంగంగానే చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ గత ప్రభుత్వం హయాంలో మాదిరిగా చేతుల్లో డబ్బులు ఉండటం లేదు. గత ప్రభుత్వ హయాంలో నెలకు ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకం కింద బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ కొన్ని పథకాలను మాత్రమే అమలు చేస్తుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఆ పథకాల డబ్బును అందచేస్తుంది.
పథకాలు అందక...
దీంతో డబ్బులు చేతిలో లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు పండగకు పెద్దగా కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాలను తాము కూడా కొనసాగిస్తూ, కొత్త పథకాలను కూడా అందిస్తున్నామని చెబుతుంది. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టామని అధికారంలో ఉన్న నేతలు చెబుతున్నారు. కానీ డబ్బులు మాత్రం బ్యాంకుల్లో లేకపోవడంతో ప్రజలు పండగ కోసం దుస్తులు, గృహాపకరణాల కొనుగోలు చేయలేకపోతున్నారన్న వాదన కూడా ఉంది. వ్యాపారులు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చేతిలో డబ్బులు లేక...
గత ప్రభుత్వ హయాంలో ఏదో ఒక పథకం క్యాలెండర్ రూపంలో ప్రతి నెల తమకు బ్యాంకుల్లో నగదు వచ్చి పడేదని, అయితే ఈసారి మాత్రం కొన్ని పథకాలు మాత్రమే అమలవుతుండటంతో డబ్బులు లేక కొనుగోలు చేయలేకపోతున్నామని అంటున్నారు. ఏపీ ప్రజలకు సంక్రాంతి పండగ పెద్ద పండగ. ఈ సమయంలో కొత్త వస్త్రాలతో బాటు, కొత్త వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇక సంక్రాంతి కనుమ రోజు మాంసాహారం కోసం కూడా ఖర్చు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం గతంతో పోలిస్తే అన్ని ధరలు పెరగడంతో తాము కొనుగోలు చేయలేకపోతున్నామని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు వాపోతున్నారు. మొత్తం మీద వ్యాపారాలు లేక ఏపీలో చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకూ గోళ్లు గిల్లుకుంటున్నారు.
Next Story

