Sat Feb 21 2026 14:56:11 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఈ సౌండేమిటి గోవిందా.. పొలిటికల్ పొల్యూషన్ తో చెవులు దిమ్మెత్తుతున్నాయ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత ఏడాది నుంచి తిరుమల లడ్డూ చుట్టూనే తిరుగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత ఏడాది నుంచి తిరుమల లడ్డూ చుట్టూనే తిరుగుతున్నాయి. తిరుమల శ్రీవారిని తమ రాజకీయం కోసం కొండ మీద నుంచి రాజకీయ పార్టీల నేతలు కిందకు దించేసినట్లే కనపడుతుంది. సున్నితమైన అంశంలో తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలి. అంతే కాని.. అదే పనిగా చెవులు రింగుమనేటట్లు ఒకటే సౌండ్. గోవిందా.. గోవిందా అనే సౌండ్ కంటే .. ఈ పొలిటికల్ పొల్యూషన్ ఏపీలో ఎక్కువయింది. ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలు రెండు తిరుమల పవిత్రతను దెబ్బతీసే పనికి పూనుకున్నాయనే చెప్పాలి. చూసేవారికి కూడా ఏవగింపుగా ఉంటోంది. వినేవారు కూడా చెవులు మూసుకుని గోవిందా అని అనుకోవాల్సి వస్తుంది.
అధికార పార్టీ అదే పనిగా...
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని నిరూపితమయితే అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం అధికారంలో ఉన్న పార్టీకి ఉంది. చట్ట ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అధికార పార్టీ తమ రాజకీయ స్వలాభం కోసం.. కేవలం ఒక వర్గం ఓట్ల కోసం పాకులాడుతున్నట్లు కనిపిస్తుంది. తిరుమల లడ్డూ వ్యవహారంతో ప్రత్యర్థులను రాజకీయంగా డ్యామేజీ చేయవచ్చన్న కోణంలోనే ఆలోచిస్తున్నారు కానీ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేఅలా ఉన్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పందికొవ్వు, గొడ్డు కొవ్వు నుంచి అటు ఇటు మారి చివరకు ఇప్పుడు నెయ్యి లేదని, కల్తీ ఉందని నిర్ధారించింది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్. దానిని పట్టుకుని ఇంకా లాగేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుంది. తాజాగా వన్ మ్యాన్ కమిషన్ ను కూడా నియమించి మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.
ప్రతిపక్ష పార్టీ కూడా...
ఇక ప్రతిపక్ష పార్టీ కూడా తక్కువ ఏమీ తినలేదు. తిరుమల లడ్డూ విషయంలో తమ పాత్ర లేదంటూనే అంతా గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పడానికి పడరాని పాట్లు పడుతుంది. మరొకవైపు శాసనమండలిలో వెంకటేశ్వరస్వామి ఫొటోలను తీసుకు వచ్చి మరీ తిరుమల దేవదేవుడిని సభలోకి కూడా లాగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తిరుమల లడ్డూకు తోడు ఇందాపూర్, హెరిటేజ్ డెయిరీల విషయాలను కూడా ప్రస్తావిస్తూ రాజకీయంగా తమ ప్రత్యర్థి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నంలో తిరుమల ప్రతిష్టను మరింత దిగజార్చేందుకు ప్రయత్నిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు దగ్గరవ్వాలని చేస్తున్న ప్రయత్నంలో హిందువులకు దూరంగా జరుగుతున్నాయని చెప్పాలి. ఈ సత్యం తెలుసుకుని ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలన్నది కోట్లాది మంది వెంకన్న భక్తుల అభిమతం.
Next Story

